Global Vaartha
Date of Publish : 07/11/2026, 10:46 am
Editor : భవ్య జర్నలిస్ట్

సమాజంలో గౌరవం పొందాలంటే.. వీటిని ఫాలో కావాలి

ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో ప్రతి వ్యక్తి గౌరవించాలని, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండాలని దాదాపుగా ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కేవలం నగదు, హోదా, ప్రతిష్ఠ ద్వారా సమాజంలో గౌరవాన్ని సంపాదించలేరు. ప్రవర్తన, మాటలతోపాటు ఆలోచనలు కూడా మంచిగా ఉండాల్సి ఉంటుంది. సమాజంలో గౌరవం పొందాలంటే.. చాణక్యుడు మూడు నియమాలు తప్పకుండా ఉండాలని తెలిపారు.

జ్ఞానాన్వేషణ ఎప్పుడూ వదలవద్దు..

సమాజంలో గౌరవమైన స్థానాన్ని పొందాలనుకుంటే.. ముందుగా జ్ఞానాన్ని నిరంతరం పెంచుకోవాలి. ఓ వ్యక్తి వద్ద డబ్బు ఉందా? లేక అతడి ఏ హోదాలో ఉన్నాడు అనే దానికంటే.. అతడి ఆలోచనలు, అనుభవాలతోపాటు జ్ఞానం మరింత ప్రభావవంతంగా ఉంటుంది. జ్ఞానంతోపాటు విద్య ఉన్న వ్యక్తిని సమాజం ఎల్లప్పుడు గౌరవిస్తుంది. జ్ఞానం అనేది ఎవరూ దోచుకోలేని సంపద. ఈ నేపథ్యంలో నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకూడదు. కొత్త విషయాలు చదవడం, వివిధ అంశాల గురించి సమాచారం తెలుసుకోవడంతోపాటు స్వంత అనుభవాల నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. జీవితంలో ప్రతి దశలోనూ కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది.

ఇలా నిత్య జ్ఞాన సముపార్జన చేయడం వల్ల వ్యక్తి ఆలోచనలు పరిణితి చెందుతాయి. ఇది అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి కూడా సహయపడుతుంది. తద్వారా ఇతరులతో వ్యవహరించేటప్పుడు మీ వ్యక్తిత్వంపై విభిన్నమైన ముద్ర వేస్తుంది. దీంతో సమాజంలో గౌరవం పొందాలంటే... మిమ్మల్ని మీరు నిరంతరం మరింత సుసంపన్నంగా చేసుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది.

మిమ్మల్ని మీరు పొగుడుకునే అలవాటు ఉందా..?

కొందరు తమ జీవితంలో సాధించిన విజయాల గురించి ఇతరులకు నిరంతరం చెబుతూ ఉంటారు. ఇతరుల కంటే తాము ఎంత గొప్పవారమని ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తారు. ఈ తరహా ప్రవర్తన వల్ల ఎదుట వ్యక్తి మనస్సులో మీపై ఉన్న గౌరవాన్ని తగ్గించే అవకాశం ఉంది. ఇలా తనను తాను పొగుడుకోవడం సరికాదు. అయితే తన పని ద్వారా తనకుంటూ ఓ గుర్తింపు సృష్టించుకోవాల్సి ఉంటుంది.

అలాగే వినయం అనేది చాలా ముఖ్యమైన వ్యక్తిత్వ లక్షణం. విజయం సాధించిన తర్వాత కూడా ఒదిగి ఉండాలి. ఇతరులను కించపరచకుండా ఉండడంతోపాటు తన గురించి గొప్పలు చెప్పుకొని వ్యక్తిని ప్రజలు గౌరవిస్తారు.

ప్రతి ఒక్కరిని గౌరవించాలి..

వయస్సు, లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించాల్సి ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉన్నవారితోపాటు సంపన్నులను గౌరవిస్తారు. తక్కువ స్థాయిలో ఉన్నవారితోపాటు ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉన్న వారిని కూడా గౌరవించాలి. ఎదుట వ్యక్తితో వ్యవహరించేటప్పుడు ఇవేమీ పట్టించుకోకూడదు. కుటుంబ సభ్యులు, కార్యాలయంలో సహోద్యోగులు, చుట్టు ఉన్న ప్రతి ఒక్కరితో గౌరవంగా మాట్లాడడం ముఖ్యం. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ప్రశాంతంగా వినాలి. వారి భావాలను పరిగణలోకి తీసుకోవాలి. వీటితోపాటు ఎవరినీ కించపరచకుండా ఉండాలి. ఇవి సంబంధాలను దృఢంగా చేస్తాయి. మీ ప్రవర్తన ద్వారా ఎదుటి వ్యక్తికి ప్రాముఖ్యత ఇస్తే.. వారిలో కూడా మీ పట్ల గౌరవం ఏర్పడవచ్చు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save