Global Vaartha
Date of Publish : 07/11/2026, 10:51 am
Editor : భవ్య జర్నలిస్ట్

షమీకి మరొక్క అవకాశమైనా ఇవ్వాల్సింది.. బీసీసీఐపై రవి శాస్త్రి అసంతృప్తి

ఇంటర్నెట్ డెస్క్: స్టార్ పేసర్ మహ్మద్ షమీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడంపై భారత మాజీ కోచ్ రవి శాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్టుల్లో షమీకి మరో అవకాశం ఇచ్చి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. షమీ విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు వ్యవహరించిన తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. మూడేళ్లకు పైగా టెస్టు జట్టుకు దూరంగా ఉన్న షమీ.. శుక్రవారం రాత్రి తన రెడ్‌బాల్ కెరీర్‌కు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అయితే వన్డేలు, టీ20ల్లో కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు.‘దేశం కోసం ఎంతో గొప్పగా ఆడిన ఆటగాడు ఇలా వీడ్కోలు పలకడం అత్యంత బాధాకరం. గత ఏడాది కాలంలో ఒక్కసారైనా షమీకి టెస్టుల్లో అవకాశం ఇచ్చి ఉండాల్సింది. టెస్టు బౌలర్‌గా జట్టులో అతడికి చోటు కల్పించాల్సింది. ఫిట్‌గా లేడు.. జిమ్‌కు వెళ్లడు.. కాబట్టే జట్టులో చోటు దక్కడం లేదనే విమర్శలు చాలానే వచ్చాయి. జిమ్‌లో కసరత్తులు చేసి ఫిట్‌గా ఉండటం కంటే మ్యాచ్‌లో 10-12 ఓవర్లు బౌలింగ్ చేయగలగడం ముఖ్యం. షమీ ఒక వర్క్‌హార్స్‌లా జట్టు కోసం నిరంతరం బౌలింగ్ చేయగలడు. బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్‌లో షమీ ప్రతి మ్యాచ్ ఆడుతూ 15-20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఒక ప్లేయర్ ఇంతకంటే ఫిట్‌నెస్‌ను ఎలా నిరూపించుకోగలడు? టెస్టు జట్టులో అవకాశం కల్పిస్తే ఇంకో 30, 40 వికెట్లు తీయగల సత్తా అతడిలో ఉంది’ అని రవి శాస్త్రి వివరించాడు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save