Global Vaartha
Date of Publish : 07/11/2026, 11:01 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఇరాన్ అణు రహస్యాలు చెబితే రూ.170 కోట్లు.. అమెరికా భారీ రివార్డు ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న తరుణంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌ అణు కార్యక్రమ సంబంధిత రహస్య సమాచారం అందించిన వారికి 20 మిలియన్‌ డాలర్ల(సుమారు రూ.170 కోట్లు) వరకు బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. సదరు సమాచారం అందించిన వారికి అవసరాన్ని బట్టి సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లు చేస్తామని కూడా వెల్లడించింది.అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 'రివార్డ్స్‌ ఫర్‌ జస్టిస్‌' కార్యక్రమం ద్వారా ఈ రివార్డును ప్రకటించినట్లు యూఎస్ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. ఇరాన్‌ అణు కేంద్రాలు, అక్కడి పరికరాలు, సాంకేతిక వ్యవస్థలు, అణు కార్యక్రమంతో సంబంధమున్న శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందికి సంబంధించిన సమాచారాన్ని అందించాలని కోరింది. అయితే ఎంత విలువైన సమాచారం అందిస్తే.. పూర్తి స్థాయిలో 20 మిలియన్‌ డాలర్ల బహుమతి లభిస్తుందనే నిర్దిష్ట వివరాలను మాత్రం వెల్లడించలేదు.

మరోవైపు.. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని తమ సైన్యం పూర్తిగా దెబ్బతీసిందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండి ఉంటే.. పశ్చిమాసియా దేశాలకు తీవ్ర ముప్పు వాటిల్లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. 8 నెలలుగా కొనసాగుతున్న ఈ పోరులో ఇరాన్‌ ఆర్థిక, సైనిక వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఆ దేశం ఇప్పుడు యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉందని, ఆ ఒప్పందం దిశగా ప్రయత్నాలు సాగిస్తోందన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save