మహదేవపూర్(కరీంనగర్): కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కాళేశ్వరంలోని ప్రసిద్ధ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఆది ముక్తేశ్వర స్వామి ఆలయం (బాలాలయం)లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ, కార్యనిర్వహణాధికారి మహేష్ తెలిపారు. ఈనెల 10 నుంచి డిసెంబరు 8 వరకు కార్తీకమాసం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలాలయంలో నిర్వహించే లక్ష పత్రి పూజను ఈ ఏడాది రద్దు చేస్తున్నట్లు చైర్మన్, ఈవో వెల్లడించారు. బాలాలయం లోపల స్థలం పరిమితంగా ఉండటంతో లక్ష పత్రి పూజ నిర్వహించే సమయంలో భక్తులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఈ నెల 13 శుక్రవారం నాగుల చవితి సందర్భంగా ఉదయం 9 గంటలకు నాగులమ్మ పుట్ట వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 23న సోమవారం వైకుంఠ చతుర్దశి సందర్భంగా రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ నిర్వహించనున్నారు. 24 మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా బాలాలయం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడంతో పాటు, రాత్రి 7 గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.కార్తీక మాసం సందర్భంగా గ్రామస్తుల సౌకర్యార్థం ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక దర్శన సమయాన్ని కేటాయించినట్లు తెలిపారు.