Global Vaartha
Date of Publish : 07/11/2026, 11:17 am
Editor : భవ్య జర్నలిస్ట్

ఏపీ పరిషత్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ 60 రోజులు భద్రపరుస్తాం: ఎస్‌ఈసీ అనిల్ చంద్ర

గుంటూరు : ఏపీలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ కౌంటింగ్ కేంద్రాన్ని ఎస్‌ఈసీ అనీల్ చంద్ర పునేఠా సందర్శించారు. అక్కడ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఎస్‌ఈసీ మీడియాతో మాట్లాడుతూ.. 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయని.. కొన్ని చోట్ల రీపోలింగ్ జరిగిందన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరుగుతోందని తెలిపారు.స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ అంతా సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో ఉందని ఎస్‌ఈసీ వెల్లడించారు. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్‌లు తెరిచారన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు వేరుగా టేబుల్స్ వేశారని తెలిపారు. కౌంటింగ్ చాలా బాగా జరుగుతోంది ఏజెంట్లు చెప్పారన్నారు. సీసీ కెమెరాల ఫుటేజ్ 60 రోజుల పాటు భద్రపరుస్తామని అన్నారు. ఏదైనా కోర్టు కేసులు ఉంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంచుతామన్నారు.

పల్నాడు జిల్లాలో కంకనాలపల్లి గ్రామస్తులు తమ సమస్య కరపత్రాలు రూపంలో తెచ్చారని ఎస్‌ఈసీని మీడియా అడిగింది. సమస్యల పరిష్కారం స్థానిక జిల్లా యంత్రాంగం చూసుకుంటుందని అనిల్ చంద్ర వివరించారు. సాయంత్రం 4 గంటలకు ఫలితాలు పూర్తిగా వస్తాయని అంచనా వేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా రిగ్గింగ్ జరిగినట్లు జిల్లా కలెక్టర్ చెబితేనే రీ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save