Global Vaartha
Date of Publish : 07/11/2026, 11:31 am
Editor : భవ్య జర్నలిస్ట్

రూ.లక్షతో సౌర వాహనం.. 17 ఏళ్ల కుర్రాడి అద్భుతం!

ఇంటర్నెట్ డెస్క్: సంకల్పం ఉంటే వయసు అడ్డంకి కాదని నిరూపించాడు హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన 17 ఏళ్ల అక్షిత్‌ ఖేరా. ప్రత్యేక ఇంజినీరింగ్‌ బృందం లేదు.. సొంతంగా వర్క్‌షాపూ‌ లేదు.. భారీ బడ్జెట్‌ అసలే లేదు. అయినా తన ఆలోచనకు పదును పెట్టి కేవలం రూ.1.02 లక్షల వ్యయంతో సౌర విద్యుత్‌ ఆధారిత త్రిచక్ర వాహనాన్ని రూపొందించాడు.స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తున్న అక్షిత్‌.. సామాన్య కుటుంబాలకు అందుబాటులో ఉండేలా ఈ వాహనాన్ని తయారుచేశాడు. ఇందులో సరకులు సరఫరా చేయడం సహా ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఇక 400 వాట్స్ కలిగిన సోలార్ ప్యానల్‌ను టాప్‌గా అమర్చగా.. అది వర్షం, ఎండ నుంచి రక్షణ కల్పిస్తూనే విద్యుత్‌నూ ఉత్పత్తి చేస్తుంది.తన ఇంట్లో పనిచేసే మహిళ కుటుంబం ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులే తన ఆలోచనకు బీజం వేశాయంటున్నాడు అక్షిత్. రోజువారీ ప్రయాణాలు, సరకు రవాణాకు అధిక ఖర్చు అవుతుండటాన్ని గమనించిన అతడు.. ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లు సామాన్యులకు భారంగా మారుతుండటాన్ని గుర్తించాడు. తొలుత పూర్తిగా సోలార్ ఎనర్జీతో నడిచే వాహనాన్ని రూపొందించాలని భావించినా.. సూర్యరశ్మి లభ్యత, ప్రయాణ దూరం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సౌర విద్యుత్‌తో పాటు బ్యాటరీ సాయంతో నడిచే విధానాన్ని ఎంచుకున్నాడు.

కిలోమీటరుకు ఖర్చు 13 పైసలే!

అక్షిత్ రూపొందించిన ఈ వాహనానికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పగటిపూట సోలార్ ప్యానల్ ద్వారా అదనపు విద్యుత్‌ లభిస్తుంది. రోజుకు సగటున 50 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. దానికి అవసరమైన విద్యుత్‌లో సుమారు 63 శాతాన్ని సౌరశక్తి నుంచే పొందవచ్చనేది అక్షిత్‌ అంచనా. వేసవిలో దీని వాటా 87 శాతం వరకు ఉండగా, వర్షాకాలంలో 41 శాతానికి తగ్గుతుంది. 50 కి.మీ.ల ప్రయాణానికి సుమారు 2.46 యూనిట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. సౌరశక్తి వాటాను పరిగణనలోకి తీసుకుంటే కి.మీ.కి అయ్యే విద్యుత్‌ ఖర్చు కేవలం 13 పైసలేనని అతడి లెక్కలు చెబుతున్నాయి. రోజుకు 75 కిలోమీటర్లు ప్రయాణించినా ఈ వ్యయం కిలోమీటరుకు సుమారు 21 పైసలే అన్నమాట.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save