Global Vaartha
Date of Publish : 07/11/2026, 12:11 pm
Editor : భవ్య జర్నలిస్ట్

బీజేపీ మద్దతుదారులు ఏడోసారి నా ఇంటిపై దాడి చేశారు.. టీఎంసీ ఎంపీ అభిషేక్

ఇంటర్నెట్ డెస్క్: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటిపై దాడి జరిగింది. కాళీఘాట్‌‌లో ఉన్న తన ఇంటిపై బీజేపీ మద్దతుదారులు శనివారం తెల్లవారుజామున దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఇలా జరగడం గత ఆరు నెలల్లో ఇది ఏడోసారని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. కాగా.. అంతకుముందు రాత్రి బీజేపీ, టీఎంసీ మద్దతుదారుల మధ్య గొడవ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తర్వాత శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో బీజేపీ మద్దతుదారులు తన ఇంటిపై రాళ్లు విసిరారని, దీనికి రెండు రోజులపాటు రెక్కీ నిర్వహించారని అభిషేక్ ఆరోపించారు. తనపై అదేపనిగా దాడులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా పోలీసులు, కోర్టు జోక్యం చేసుకోవడంలేదని అన్నారు.కాగా.. దాడికి సంబంధించి రెండు వీడియోలను అభిషేక్ బెనర్జీ షేర్ చేశారు. ఒక వీడియోలో ఓ వ్యక్తి వెదురు కర్రలతో బిల్డింగ్ గేట్లపై దాడిచేస్తూ కనిపించాడు. మరో వీడియోలో పలువురు ఓ గుంపు పలు వస్తువులను ఆయన బిల్డింగ్ వైపు విసురుతూ కనిపించింది. ఆ రెండు వీడియోలను ఎక్స్‌లో అభిషేక్ పోస్టు చేశారు. ‘బెంగాల్‌లో ఒక ఎంపీ పరిస్థితే ఇలా ఉంటే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంది? శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. వాటిని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ, పోలీసులు విఫలమయ్యారు. గూండాలు రోజు అల్లర్లకు పాల్పడుతున్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save