Global Vaartha
Date of Publish : 07/11/2026, 12:14 pm
Editor : భవ్య జర్నలిస్ట్

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా కొత్త పీజీ సీట్లకు ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్తగా 359 పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. ఎన్ఎంసీ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఆయా కాలేజీల్లో సీట్లు సంఖ్య 1,266 నుంచి 1,625కు పెరగనున్నాయి. 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తొలిసారిగా ఈ పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో 23 కాలేజీల్లో కొత్తగా పీజీ కోర్సులు ఏర్పాటు చేయనుంది. గతంలో కేవలం 10 కాలేజీల్లోనే పీజీ కోర్సులు ఉండగా.. తాజా ఎన్ఎంసీ అనుమతితో మరో 13 కాలేజీలకు వీటిని విస్తరించనుంది.నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వనపర్తి, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, నిర్మల్, సంగారెడ్డి, నర్సంపేట కాలేజీలకు తొలిసారిగా పీజీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ కేటాయించింది. ఫ్యాకల్టీ నియామకాలు, మౌలిక సదుపాయాల కల్పన, నూతన భవనాలతోపాటు ఆసుపత్రుల్లో సౌకర్యాల మెరుగుదల కారణంగా ఈ పీజీ సీట్లను పెంచింది. తమ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలను అభివృద్ధి చేయడంతో ఎన్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పీజీ కోర్సుల ఏర్పాటుతో జిల్లా స్థాయిలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలకు మరింత అవకాశం కల్పించినట్లు అయింది. ఇకపై ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులోకి రానుండడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. అలాగే ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులకు రాష్ట్రంలోనే పీజీ వైద్య విద్య అభ్యసించేందుకు ఉన్న అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి. ఎన్ఎంసీ తీసుకున్న తాజా నిర్ణయంతో.. నిమ్స్‌ (NIMS)లో అదనంగా 107, ఈఎస్ఐసీ (ESIC) మెడికల్ కాలేజీలో 106 పీజీ సీట్లు పెరగనున్నాయి. అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సుమారు 2,600 పీజీ సీట్లు పెరగనున్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save