Global Vaartha
Date of Publish : 07/11/2026, 12:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

స్నేహితుడి కూతురు తిరస్కరించిందని వివాహితుడి ఆత్మహత్య

ఇంటర్నెట్ డెస్క్: తన స్నేహితుడి కూతురు తిరస్కరించిందని ఓ వివాహితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలోని వజీర్‌పూర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. మ‌ృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన సందీప్‌ (47) గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సందీప్ యూపీలోని సంత్ కబీర్ నగర్ నివాసి. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఢిల్లీలోని తన స్నేహితుడి ఇంటికి అతను తరచూ వెళ్లేవాడు. ఆ స్నేహితుడికి ఒక కూతురు ఉంది. ఆమె ఢిల్లీలో వజీర్‌పూర్‌లోని ఒక యుటెన్సిల్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. ఢిల్లీలోనే కొంతకాలంగా ఒంటరిగా నివసిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు సందీప్ ఆకర్షితుడయ్యాడు. తరచూ ఆమెకు ఫోన్ చేసి మాట్లాడేవాడు.తనను ప్రేమించాలని బలవంతం చేసేవాడు. అయితే, కొంతకాలంగా ఆ అమ్మాయి సందీప్‌తో మాట్లాడడం మానేసింది. దీంతో అతను మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో గురువారం ఢిల్లీ వెళ్లాడు. శుక్రవారం రెండు బాటిళ్లలో పెట్రోల్ తీసుకొని ఆ అమ్మాయి పనిచేసే ఫ్యాక్టరీకి వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టాడు. ఆమె తిరస్కరించడంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తనపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే ఫ్యాక్టరీ కార్మికులు మంటలను ఆర్పి సందీప్‌ను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. కాగా.. అంతకుముందు అతను ఒక సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. తనతో ఆ అమ్మాయి మాట్లాడడం లేదని, తమ స్నేహాన్ని బ్రేక్ చేసిందని చెప్పాడు. అయితే, సందీప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆ అమ్మాయి తెలిపింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save