Global Vaartha
Date of Publish : 07/11/2026, 1:17 pm
Editor : భవ్య జర్నలిస్ట్

గ్రామ పంచాయతీలకు తెలంగాణ సర్కార్ తీపి కబురు..

హైదరాబాద్ : తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

గ్రామ పంచాయతీలు వివిధ మార్గాల ద్వారా సమకూర్చుకునే సొంత ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయాల్సిన అవసరం లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు పంచాయతీల సొంత ఆదాయాన్ని నేరుగా ఆయా గ్రామ పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేసుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఈ కొత్త విధానం అక్టోబర్ తొమ్మిది నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

గతంలో గ్రామ పంచాయతీలు పన్నులు, ఇతర రుసుముల రూపంలో వసూలు చేసిన ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయాల్సి వచ్చేది.

దీంతో గ్రామాల్లో సేకరించిన ఆదాయాన్ని తిరిగి స్థానిక అవసరాలకు వినియోగించుకోవాలంటే ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది.

తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గ్రామ పంచాయతీలకు ఆర్థికపరమైన స్వేచ్ఛ కలగనుంది.

అభివృద్ధి పనులకు నిధుల వినియోగంలో వెసులుబాటు

గతంలో అమల్లో ఉన్న విధానం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ,

సిబ్బంది జీతభత్యాలు, వీధి దీపాల నిర్వహణ,

తాగునీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులకు నిధులు విడుదల చేయించుకోవడంలో పంచాయతీలు ఇబ్బందులు ఎదుర్కొనేవి.

ముఖ్యంగా బిల్లుల చెల్లింపులు,

నిధుల మంజూరులో జాప్యం కారణంగా కొన్ని అభివృద్ధి పనులు సకాలంలో పూర్తికాకుండా నిలిచిపోయేవి.

ఇప్పుడు సొంత ఆదాయం నేరుగా పంచాయతీల బ్యాంక్ ఖాతాల్లోనే జమ కానుండటంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిధులను వినియోగించుకునే అవకాశం ఏర్పడనుంది.

అత్యవసర పారిశుద్ధ్య పనులు,

గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి,

ఇతర ప్రజా అవసరాలపై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ఈ విధానం దోహదపడనుంది.

మొత్తంగా గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనను పెంచడంతో పాటు స్థానిక పాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారనుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save