హైదరాబాద్ : దీపావళి అనంతరం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం’ పేరుతో పాదయాత్రలు నిర్వహిస్తామని బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఈ పాదయాత్రలకు జాతీయ నాయకులు ముఖ్య అతిథిలుగా రాబోతున్నట్లు ఆయన తెలిపారు.‘రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తే అడ్డుకుంటాం. నల్ల జెండాలతో మా నిరసనను వ్యక్తం చేస్తాం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను రాహుల్ గాంధీ మోసం చేశాడు. భారత్ సమ్మిట్ నిర్వహణకు మేము వ్యతిరేకం కాదు. తెలంగాణకు పరిశ్రమలు, పెట్టుబడులు వస్తే మేము ఆహ్వానిస్తాం. కానీ రైతులను ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోము. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యతను పక్కనపెట్టి.. ఢిల్లీలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి పద్ధతి కాదు. రైతులపై గల బాధ్యతలను మరచి.. రాష్ట్రం కేంద్రంపై నేరాలను నెట్టేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ రాంచందర్ రావు తీవ్రంగా విమర్శించారు.