Global Vaartha
Date of Publish : 07/11/2026, 1:49 pm
Editor : భవ్య జర్నలిస్ట్

జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్.. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం

కడప : కడప జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకంగా మాజీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో కూటమి అభ్యర్థులు విజయదుందుబి మోగించారు. పులివెందుల, మైదుకూరు జడ్పీటీసలను టీడీపీ కైవసం చేసుకుంది. పులివెందులలో 1,463 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి భారతి విజయం సాధించగా.. మైదుకూరులో 18,903 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కృష్ణకిషోర్ గెలుపొందారు.పులివెందుల నియోజకవర్గంలో మొత్తం 65 ఎంపీటీసీ స్థానాల్లో 64 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. వేంపల్లి మండలం రెడ్డిపల్లి ఎంపీటీసీకి మాత్రమే ఎన్నిక జరిగింది. అలిరెడ్డిపల్లిలో కూడా 29 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. అటు.. బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలం జడ్పీటీసీ టీడీపీ అభ్యర్థి ఓబులమ్మ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై 8391 ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు.

కుప్పం నియోజకవర్గంలో బోణీ కొట్టని వైసీపీ

చిత్తూరు: కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ఖాతా తెరవలేకపోయింది. పరిషత్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. ఇక ఎంపీటీసీ ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. రామకుప్పం మండలం మనేంద్రం ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి 712 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కుప్పం మండలం నడుమూరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి 1166 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. శాంతిపురం మండలం సి.బండపల్లి టీడీపీ అభ్యర్థి 718 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా.. మొరసనపల్లి టీడీపీ అభ్యర్థి 494 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save