Global Vaartha
Date of Publish : 09/11/2026, 10:50 am
Editor : భవ్య జర్నలిస్ట్

రాజకీయాల కోసం రాయలేదు.. ఆత్మకథపై సోనియాగాంధీ క్లారిటీ

ఇంటర్నెట్ డెస్క్: తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ గ్రంథం విడుదలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పలు విషయాలను పంచుకున్నారు. ఆ పుస్తకం రాజకీయ ప్రయోజనాల కోసం రాసింది కాదని ఆమె వెల్లడించారు. అది పూర్తిగా వ్యక్తిగతమైన గ్రంథమని తెలిపారు. తాను ప్రేమించే కుటుంబాన్ని నిజాయితీతో చిత్రీకరించేందుకు స్వీయచరిత్రకు పూనుకున్నానని చెప్పారు. నవంబర్ 10న ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆంగ్ల పత్రిక ‘ది హిందూ’లో సోనియాగాంధీ ఒక వ్యాసం రాశారు. అందులో ఆత్మకథ రాయటానికి గల కారణాలు ఆమె వివరించారు.‘నా పుస్తకం రాజకీయాలకు సంబంధించినది కాదు. ఇది కేవలం వ్యక్తిగత అంతరంగ ఆవిష్కరణ. మా కుటుంబం గురించి ఎందరో ఎన్నో రాశారు. అయితే మా కుటుంబ సభ్యుల వ్యక్తిత్వం, ప్రేరణలు, పోరాటాలు, సహజ లోపాల గురించి లోతైన అవగాహనతో రాసిన వారు చాలా తక్కువ. అందుకే మా కుటుంబాన్ని నేను నిజాయితీగా చిత్రీకరించాలనుకున్నాను’ అని సోనియా పేర్కొన్నారు.అలాగే గత ఐదు దశాబ్దాలుగా తాను చూస్తున్న భారతావనిని పాఠకులతో పంచుకోవాలని భావించి ఆత్మకథను రచించానని సోనియాగాంధీ అన్నారు. ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో తన ప్రయాణం గురించి, తాను ఇల్లు అని పిలిచే ప్రాంతం గురించి రాశానని ఆమె వివరించారు. కాగా 544 పేజీలతో కూడిన ఈ స్వీయచరిత్ర రేపు (మంగళవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పుస్తకాన్ని హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురించింది. మరోవైపు ఈ గ్రంథం నిండా రాజకీయ విమర్శలే ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఇందులో వ్యక్తిగత విషయాల కన్నా రాజకీయ అంశాలే ఎక్కువని విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తన పుస్తకం రాజకీయాలకు సంబంధించినది కాదని సోనియాగాంధీ స్పష్టం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save