Global Vaartha
Date of Publish : 09/11/2026, 10:53 am
Editor : భవ్య జర్నలిస్ట్

దీపావళి తర్వాత ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. 366కు చేరిన సగటు ఏక్యూఐ..!

న్యూఢిల్లీ : దీపావళి వేడుకల తర్వాత దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇవాళ (సోమవారం) ఉదయం 6:30 గంటల సమయానికి నగరంలో గాలి నాణ్యత సూచీ (AQI) 366కు చేరింది. ఇది 'వెరీ పూర్' (చాలా అధ్వాన్నం) కేటగిరీ కిందకు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. పండుగ సందర్భంగా టపాసులు పేల్చడంతో గాలిలో కాలుష్య తీవ్రత పెరిగింది. నగరంలోని పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో రోడ్లు సరిగ్గా కనిపించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.కాలుష్య నియంత్రణ మండలి (CPCB) ప్రకారం.. 301 నుంచి 400 మధ్య ఏక్యూఐ ఉంటే 'వెరీ పూర్'గా, 401 నుంచి 500 మధ్య ఉంటే 'సీవియర్'గా పరిగణిస్తారు. అయితే, నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 300కు పైగా ఏక్యూఐ నమోదవగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఆందోళనకరంగా 400 మార్కును దాటింది. వివేక్ విహార్‌లో అత్యధికంగా 441 ఏక్యూఐ నమోదు కాగా, జహంగీర్‌పురిలో 439, రోహిణిలో 435, చాందినీ చౌక్‌లో 418, ముండ్కాలో 413, పంజాబీ బాగ్‌లో 408 నమోదయ్యాయి. ఇక అలీపూర్‌లో 391, అయా నగర్‌లో 378, బురారీలో 373, ఆనంద్ విహార్‌లో 337, అశోక్ విహార్‌లో 312 చొప్పున నమోదయ్యాయి. ఇంకా పలు ప్రాంతాల్లో 300కు పైగానే ఏక్యూఐ రికార్డయ్యింది.

మరోవైపు, కాలుష్య తీవ్రత దృష్ట్యా ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఐదో తరగతి వరకు హైబ్రిడ్ విధానంలో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే పలు రకాల వాహనాలపై ఆంక్షలు విధించింది. ముఖ్యంగా డీజిల్ వాహనాలు, బీఎస్-IV లేదా అంతకంటే తక్కువ ప్రమాణాలు కలిగిన వాణిజ్య వాహనాలను నగరంలో నిషేధించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save