అమరావతి : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి. రాజాం, గన్నవరం, తిరువూరులో జరిగిన ప్రమాదాల్లో షాపులు దగ్ధమవడంతో పాటు భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ఈ మూడు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజయనగరం జిల్లా రాజాంలోని ఓ ఆటోమొబైల్ షోరూమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో భారీఎత్తున ఆస్తినష్టం జరిగింది. దీపావళి టపాసులు ప్రమాదవశాత్తు షోరూమ్‌పై పడి మంటలు అంటుకోవటంతో షోరూమ్ దగ్ధమైంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం చోటు చేసుకుంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసినట్టు ముఖ్యమంత్రికి అగ్నిమాపక శాఖ ఉన్నతాధికారులు తెలియజేశారు.కృష్ణా జిల్లా గన్నవరంలో బాణసంచా కాలుస్తుండగా నిప్పు రవ్వలు ఎగిరిపడి ఓ ఫర్నిచర్ దుకాణానికి మంటలు అంటుకున్నాయి. తిరువూరులోని మరో దుకాణంలోనూ షార్ట్ సర్క్యూట్ జరిగి షాపు దగ్ధమైంది. మంటల కారణంగా ఆస్తినష్టం జరగటంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఈ మూడు ఘటనలపై ఆరా తీసి జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
అగ్నిప్రమాదాలపై హోంమంత్రి అనిత
ఏపీలోని మూడు ప్రాంతాల్లో జరిగిన అగ్నిప్రమాదాలపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆరా తీశారు. విజయనగరం జిల్లా రాజాంలో ఆటోమొబైల్ షోరూమ్ అగ్నిప్రమాదం సంభవించగా.. కృష్ణా జిల్లా గన్నవరంలో బాణసంచా నిప్పురవ్వలతో ఫర్నిచర్ దుకాణంలో మంటలు చెలరేగాయి. తిరువూరులో షార్ట్ సర్క్యూట్‌తో మరో దుకాణం దగ్ధమైంది. ఈ మూడు అగ్నిప్రమాదాల వివరాలను హోంమంత్రి.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదాల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు అనిత సూచనలు చేశారు.