ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ వినియోగదారులకు మరో ఆసక్తికరమైన ఫీచర్ అందుబాటులోకి రానుంది. మెసేజ్లు చదివినట్లు ఎదుటివారికి బ్లూ టిక్స్ కనిపించకుండానే.. వాటిని చూసే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. 'చాట్ ప్రివ్యూ' పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ ఫీచర్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వెర్షన్‌లో టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఎలా పనిచేస్తుందంటే?
వాట్సాప్ చాట్ లిస్ట్‌లోని పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌పై కొద్దిసేపు నొక్కి ఉంచితే.. ప్రత్యేక ప్రివ్యూ విండో ఓపెన్ అవుతుంది. అందులో తాజాగా వచ్చిన సందేశాలను చూడటం సహా స్క్రోల్ చేసి మరిన్ని మెసేజ్లను చదవొచ్చు. ఇందుకోసం చాట్‌ను ఏమాత్రం తెరవాల్సిన అవసరముండదు. దీంతో సందేశాలు చదివినప్పటికీ సాధారణంగా కనిపించే బ్లూ టిక్స్ అవతలివాళ్లకు కనిపించదు.
ప్రివ్యూ విండోలో సందేశాలు చూడటమే కాకుండా.. అదే సమయంలో మరికొన్ని పనులూ చేసుకోవచ్చు. చాట్‌ను రీడ్‌గా గుర్తించడం, పిన్ చేయడం, ఆర్కైవ్‌లోకి పంపడం, సెలెక్ట్ చేయడం, డిలీట్ చేయడం వంటి ఆప్షన్లూ ఉండనున్నాయి. అదనంగా చాట్ లాక్, సమాచారం తెలుసుకోవడం, హోమ్ స్క్రీన్‌పై షార్ట్‌కట్ ఏర్పాటు వంటి సదుపాయాలు కూడా వచ్చే అవకాశముంది.
ఐఫోన్‌లో ఇప్పటికే..
కాగా.. ఐఫోన్ వినియోగదారులకు ఈ ఫీచర్ చాట్ ప్రివ్యూ సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్లకూ ఇదే తరహా సదుపాయాన్ని విస్తరించేందుకు వాట్సాప్ యత్నిస్తోంది. అయితే ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఎప్పుడు బీటా వెర్షన్‌లోకి వస్తుంది? సాధారణ వినియోగదారులకు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందనే విషయాలపై సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.