Global Vaartha
Date of Publish : 09/11/2026, 2:10 pm
Editor : భవ్య జర్నలిస్ట్

వైసీపీ పోటీలో ఉన్నా ప్రజలు తిరస్కరించారు.. కూటమికి భారీ విజయం: ఎంపీ కేశినేని చిన్ని

విజయవాడ : స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు  మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. కూటమి పార్టీల సమన్వయంతోనే ఘన విజయం సాధ్యమైందని తెలిపారు. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామని వివరించారు.

నాలుగు ఓట్ల తేడాతో ఒక ఎంపీటీసీ స్థానాన్ని కోల్పోయామని.. మరో స్థానంలో కేవలం ఎనిమిది ఓట్ల తేడాతో ఓటమి చెందామని ఎంపీ చెప్పుకొచ్చారు. స్వల్ప తేడాతో ఓడినా ప్రజల తీర్పును గౌరవించామన్నారు. గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ప్రజలకు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. సంక్షేమం, అభివృద్ధి గెలిచిందని అన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనూ ఎన్టీఆర్ జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో ఆ పదవి తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని చిన్ని అన్నారు. గతంలో టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తే, ఈసారి వైసీపీ పోటీలో ఉన్నా ప్రజలు వారిని తిరస్కరించి కూటమికి భారీ విజయం అందించారని తెలిపారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, అరాచకశక్తుల వల్లే పల్నాడు, రాయలసీమల్లో ఎన్నికల సందర్భంగా అల్లర్లు జరిగాయన్నారు. పల్నాడు, రాయలసీమ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save