Global Vaartha
Date of Publish : 09/11/2026, 2:11 pm
Editor : భవ్య జర్నలిస్ట్

భారతీయ పర్యాటకుల ప్రవర్తనపై హర్ష్ గోయెంకా సీరియస్..

ఇంటర్నెట్ డెస్క్: విదేశీ గడ్డపై భారతీయ పర్యాటకుల ప్రవర్తన మరోసారి చర్చనీయాంశమైంది. వియత్నాం విమానాశ్రయంలో కొందరు భారతీయులు వ్యవహరించిన తీరు నెట్టింట వైరల్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తీవ్రంగా స్పందించారు. విమానాశ్రయాలను పిక్నిక్ ప్రదేశాలుగా మార్చడం ఏమిటంటూ ప్రశ్నించారు. అసలు మనకు పౌర బాధ్యత ఎప్పుడు అలవడుతుందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి.పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. వియత్నాం విమానాశ్రయంలో కొందరు భారతీయ ప్రయాణికులు నేలపై కూర్చొని ఆహారం తింటూ కనిపించారు. విమానాశ్రయం వంటి అంతర్జాతీయ ప్రదేశంలో వారు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది. ఈ వీడియో కాస్తా పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా దృష్టికి వెళ్లింది. దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భారతీయ పర్యాటకుల ప్రవర్తనను ప్రశ్నించారు. వియత్నాం భారతీయులకు ఇష్టమైన పర్యాటక గమ్యస్థానంగా మారుతోందని, అయితే అక్కడి విమానాశ్రయాలను పిక్నిక్ ప్రదేశాలుగా మార్చడం సరికాదన్నారు. ఇలా ఆహారం తినడం, చెత్త పడవేయడం వంటి చర్యలు దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

విదేశాలకు వెళ్లినప్పుడు కనీస పౌర బాధ్యతను ఎందుకు మర్చిపోతున్నాం?, ప్రయాణాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించడం ఎప్పుడు నేర్చుకుంటాం? అని హర్ష్ గోయెంకా ప్రశ్నించారు. విదేశాల్లో మన ప్రవర్తన కేవలం వ్యక్తిగత వ్యవహారం కాదని, దేశం గురించి ఇతరులకు ఏర్పడే అభిప్రాయంపైనా ప్రభావం చూపుతుందన్నారు. ఆయన పోస్టును 4.35 లక్షల మంది వీక్షించగా.. దాదాపు 6 వేల మంది లైక్ చేశారు. పారిశ్రామికవేత్త వ్యాఖ్యలను అనేక మంది సమర్థించగా.. ప్రయాణికులకు మద్దతుగా పలువురు కామెంట్లు పెట్టారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save