Global Vaartha
Date of Publish : 09/11/2026, 4:21 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ప్రజల తీర్పే కూటమికి కొండంత బలం

  • మరో 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి పాలనే: ఎంపీ కేశినేని చిన్ని
  • స్థానిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కూటమి తన సత్తా చాటిందని, రాబోయే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి అధికారంలో కొనసాగుతుందన్న నమ్మకం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన, ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, దూరదృష్టితో కూడిన నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసం ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని కేశినేని చిన్ని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎంపీ కేశినేని చిన్ని ఖండించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలని హితవు పలికారు. గత ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిగణనలోకి తీసుకుని కూటమికి మద్దతుగా నిలిచారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇచ్చిన తీర్పు కూటమి నాయకులు, కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని ఎంపీ చిన్ని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా రానున్న రోజుల్లో మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయవచ్చని కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save