Global Vaartha
Date of Publish : 09/11/2026, 4:24 pm
Editor : భవ్య జర్నలిస్ట్

హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక మలుపు..

హైదరాబాద్ : నగరంలోని ఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తాను చేసిన తప్పును అంగీకరించినప్పటికీ.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధిస్తున్నారని మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు తోటి విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు ప్రిన్సిపల్, లెక్చరర్లను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..కుటుంబసభ్యులు, తోటి విద్యార్థుల కథనం ప్రకారం.. భాను ప్రసాద్ రెడ్డి అనే యువకుడు.. హైదరాబాద్‌లోని ఓ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజ్‌లో కోర్సు తీసుకుంటున్నారు. కాగా.. భాను ప్రసాద్ సరదాగా.. ఓ మహిళా లెక్చరర్ ఫొటోను ఏఐని వినియోగించి మార్ఫింగ్ చేశారు. ఇది తెలుసుకున్న ఆ లెక్చరర్ విద్యార్థి నుంచి ఫోన్‌ స్వాధీనం చేసుకుని.. ప్రిన్సిపల్‌ చంద్రమోహన్‌‌‌కు అందజేశారు. దీంతో పశ్చాత్తాపం చెందిన భానుప్రసాద్.. తన తప్పును అంగీకరించి మహిళా లెక్చరర్‌, ప్రిన్సిపల్‌ను క్షమాపణ కోరారు. అయినా సరే.. ప్రిన్సిపల్ చంద్రమోహన్, మరో లెక్చరర్ భాస్కర్.. ఫోన్ తిరిగి ఇవ్వకుండా వారం రోజులుగా అట్టిపెట్టుకోవడం, దూషిస్తుండడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భాను ప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రిన్సిపల్, లెక్చరర్‌ను అరెస్ట్ చేసి.. కోర్టులో హాజరుపరచగా.. జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save