Global Vaartha
Date of Publish : 09/11/2026, 4:25 pm
Editor : భవ్య జర్నలిస్ట్

మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి

ఇంటర్నెట్ డెస్క్: కాశీలో అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించిన ఘటన ఝార్ఖండ్‌లో తాజగా వెలుగు చూసింది. ఓ వాహనంలో మృతదేహాన్ని తీసుకుని వెళుతుండగా హజారీబాగ్ జిల్లా దానువా వ్యాలీ వద్ద రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో ఏడుగురు మరణించగా 14 మంది గాయపడ్డారు. బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.స్థానిక మీడియా కథనాల ప్రకారం, బాగోదార్ ప్రాంతానికి చెందిన కొందరు తమ వాహనంలో మృతదేహాన్ని తీసుకుని కాశీకి బయలుదేరారు. అయితే, కాలకృత్యాలు తీర్చుకునేందుకు వారు దానువా వ్యాలీ వద్ద వాహనాన్ని ఆపుతుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ కారును రోడ్డు పక్కన నిలుపుతున్న సమయంలో ఓ ట్రక్కు వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. గాయపడ్డ వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఏడుగురు కన్నుమూశారు. చికిత్స పొందుతున్న మరో 14 మందిలో కొందరు మెరుగైన చికిత్స కోసం హజారీబాగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save