హైదరాబాద్ : సచివాలయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పునర్వ్యవస్థీకరణపై మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో డీసీహెచ్ఎస్ కార్యాలయాల ఏర్పాటుపై సమీక్ష జరిపారు. సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థ బలోపేతానికి మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యుల నియామకాలతో పాటు అవసరమైన నర్సులు, టెక్నీషియన్ల నియామకాలు కూడా చేపట్టినట్లు తెలిపారు.30, 50, 100 పడకల ఆసుపత్రులకు వేర్వేరు వైద్య సేవల ప్రణాళికను రూపొందించాలని మంత్రి సూచించారు. ప్రతి ఆసుపత్రిలో స్పెషలిస్ట్ వైద్య సేవలు, ఆధునిక పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఐపీహెచ్ఎస్ ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల పనితీరు, వైద్య సేవల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. చిన్న చిన్న వైద్య సమస్యలకూ హైదరాబాద్‌కు వెళ్లే పరిస్థితి తగ్గించడమే లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు.