అనంతపురం: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వైసీపీ అరాచకాలకు దిగింది. పోలింగ్ ప్రశాంతంగా సాగకుండా అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేసింది. ప్రశాంతంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్దకెళ్లి వైసీపీ వర్గీయులు కయ్యానికి కాలు దువ్వారు. గొడవలు, ఘర్షణలు, బ్యాలెట్ పేపర్ల చించివేత, బాక్సులు ధ్వంసం చేయడం తదితర ఘటనలతో వీరంగం సృష్టించారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ మూకలు.. ఆ పార్టీ స్థానిక ముఖ్య నేతల ప్రోద్బలంతో దాడులకు తెగబడ్డారు. గురువారం ఉదయం 7 గంటలకు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభంకాగానే... ఓటర్లు పెద్దఎత్తున బారులు తీరారు. అది జీర్ణించుకోలేని వైసీపీ కుట్రలకు తెరలేపింది. ఆ మేరకు పలు ప్రాంతాల్లో గొడవలు, ఘర్షణలకు ఆ పార్టీ శ్రేణులు దిగాయి.
అనంతపురం క్రైం: పరిషత్ పోలింగ్ వేళ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. ఆయన గురువారం పలు ప్రాంతాల్లో పర్యటించి, పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాప్తాడు, ప్రసన్నాయపల్లి పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను సమీక్షించారు. సమస్యాస్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు.పోలింగ్ కేంద్రాల వద్ద ‘ఈగల్ ఐ’ నిఘా పెట్టామన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, రౌడీమూకల చొరబాట్లను వీటి ఆధారంగా పసిగడతామన్నారు. క్షేత్రస్థాయి పోలీసు అఽధికారులు బాడీ వార్న్ (ధరించే) కెమెరాలతో విధుల్లో ఉంటారన్నారు. అల్లర్లు, గొడవలకు పాల్పడిన వారిని డిజిటల్ ఆధారాలతో గుర్తించి, చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
28 జడ్పీటీసీ.. 353 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్
జిల్లాలో 31 జడ్పీటీసీ స్థానాలుండగా... మూడు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో గుంతకల్లు, గుత్తి, పామిడి జడ్పీటీసీ స్థానాలున్నాయి. మిగిలిన 28 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 12,44,920 ఓట్లు ఉండగా.. 8,89,333 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లావ్యాప్తంగా 71.44 శాతం ఓట్లు పోలయ్యాయి. 412 ఎంపీటీసీ స్థానాలకుగానూ 59 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 353 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విశేషమేమంటే... గుంతకల్లు నియోజకవర్గంలోని మూడు జడ్పీటీసీ స్థానాలతోపాటు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఆ నియోజకవర్గంలో పోలింగ్ జరగలేదు.