ఇంటర్నెట్ డెస్క్: లాస్ ఏంజెలెస్ మేయర్‌గా భారత సంతతి మహిళ నిత్యా రామన్ ఎన్నికవడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ‘ఎక్స్’ లో అభినందించారు. అలాగే న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఎన్నికను కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం అమెరికాలోని రెండు పెద్ద నగరాలకు భారత సంతతి వ్యక్తులు నాయకత్వం వహిస్తున్నారని ఆయన కొనియాడారు. ‘తిరువనంతపురం బిడ్డ నిత్యా రామన్ ఇప్పుడు లాస్ ఏంజెలెస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. భారత్‌లో ఉన్న మేయర్ల కన్నా మమ్దానీ, నిత్య గొప్పగా పనిచేస్తారని ఆశిస్తున్నా’ అని థరూర్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భారత్‌లో ఉన్న మేయర్ల వ్యవస్థపైనా ఆయన పలు విమర్శలు చేశారు. భారతదేశంలో ఉన్న మేయర్లు బ్రిటిష్ కాలం నాటి పాత వ్యవస్థ వల్ల ఎలాంటి అధికారం, బడ్జెట్ లేక నిస్సహాయులుగా మిగిలిపోయారని పేర్కొన్నారు.కాగా.. భారత సంతతికి చెందిన, డెమోక్రటిక్ సోషలిస్ట్స్ ఆఫ్ అమెరికా మద్దతు ఉన్న సిటీ కౌన్సిలర్ నిత్యా రామన్ లాస్ ఏంజెలెస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుత మేయర్ కరెన్ బాస్‌ను ఆమె ఓడించారు. గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో నిత్యా రామన్‌కు తిరుగులేని ఆధిక్యం వచ్చింది. దీంతో బాస్ తన ఓటమిని అంగీకరించారు. ఇక లాస్ ఏంజెలెస్ 44వ మేయర్‌గా నిత్య బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని ఆమె ఎక్స్‌లో వెల్లడించారు. తనను మేయర్‌గా ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ముందున్న పనులు కఠినమైనవని, మార్పు రావడానికి సమయం పడుతుందని ఆమె పేర్కొన్నారు.