హైదరాబాద్, నవంబర్ 6: నగరంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సస్పెన్షన్‌లో ఉన్న డీఎస్పీ సంకిరెడ్డి భీమ్ రెడ్డికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనకు చెందినవిగా భావిస్తున్న బినామీ ఆస్తులపై కీలక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు రూ.59.4 లక్షల విలువైన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు.సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని ముత్తంగి బృందావన్ గార్డెన్స్‌లో 200 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు ఇళ్లను గుర్తించి జప్తు చేశారు. రికార్డుల్లో ఒక్కో ఇంటి విలువ రూ.14.2 లక్షలుగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఈ ఇళ్లను జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ జి.కల్యాణ్ బాబు 2023 జూలైలో ఇంద్రకిరణ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు ఐటీ విచారణలో వెల్లడైంది. అనంతరం ఎలాంటి నగదు చెల్లింపులు జరగకుండానే ఇళ్లను ఇంద్రకిరణ్ పేరుతో బదిలీ చేసినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. ఇంద్రకిరణ్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ ఆస్తుల వెనుక అసలు లబ్ధిదారుడు డీఎస్పీ భీమ్ రెడ్డేనని అధికారులు గుర్తించినట్లు సమాచారం.