Global Vaartha
Date of Publish : 06/11/2026, 1:00 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తా.. ట్రంప్ హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌ను హెచ్చరిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. తమ ప్రతిపాదనలకు ఒప్పుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఓవల్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఈ నేపథ్యంలో శాంతి ఒప్పందానికి సంబంధించి అమెరికాకు ఇరాన్ ఓ ప్రతిపాదన పంపింది. అయితే, అంతకుముందు తాము చేసిన ఏడు డిమాండ్లకు అమెరికా ఒప్పుకుంటేనే ఆ ప్రతిపాదనపై చర్చకు తాము ముందుకు వస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఆ ప్రతిపాదనను అమెరికా సమీక్షించిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ ఇరాన్ అధికారి ఒక వార్తా సంస్థకు తెలిపారు. అంతకుమించిన వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా.. తమ ఏడు డిమాండ్లకు అమెరికా ఒప్పుకోనంత కాలం హోర్ముజ్ జలసంధిని తెరవబోమని, అలాగే అమెరికాతో చర్చలు జరపబోమని ఇరాన్ టాప్ సెక్యూరిటీ అధికారి మోహ్‌సిన్ రెజాయ్ అంతకుముందు తెలిపారు.

ఏంటా ఏడు డిమాండ్లు?

ఇరాన్ ఏడు డిమాండ్లను వెల్లడించనప్పటికీ ఖలీజ్ టైమ్స్ ఆ డిమాండ్ల జాబితాను ప్రకటించింది. యుద్ధానికి పూర్తిగా ముగింపు పలకడం, ఇరానియన్ పోర్టులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, ఇరాన్‌పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం, సీజ్ చేసిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆస్తులను విడుదల చేయడం, ఇరాన్‌లో అమెరికా మిలిటరీని తగ్గించడం, యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించడం, ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులు నిలిపివేయడం వంటి డిమాండ్లను ఇరాన్.. అమెరికా ముందు ఉంచింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save