Global Vaartha
Date of Publish : 06/11/2026, 1:09 pm
Editor : భవ్య జర్నలిస్ట్

ప్రజాసమస్యల పరిష్కారానికై నా పోరాటం!

షిర్డీ సాయి కంపెనీ నుంచి ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టులో నేను దాఖలు చేసిన కేసులో ఈరోజు వాదనలు పూర్తయ్యాయి.

మరోవైపు, మేయర్ ఎన్నికల్లో నాకు వచ్చిన ఓట్లను చూసి ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొందరు ఊహించుకున్నట్లున్నారు. కానీ నేను రాజకీయాలను వదిలి వెళ్లే వ్యక్తిని కాదని అర్థమయ్యాక, సోషల్ మీడియాలో నాపై విమర్శలు, అవహేళనలు, స్పాన్సర్డ్ వీడియోల ప్రచారం మొదలుపెట్టారు.

నన్ను నా పక్కనున్న వాళ్లు చెడగొడుతున్నారట! బహుశా నేను సొంతంగా ఆలోచించలేనని వారి అభిప్రాయమేమో! నా పరువు పోయిందట! సుజనా చౌదరి గారు వెనకుండి నడిపించి నా రాజకీయ ప్రస్థానానికి అడ్డుకట్ట వేశారట!చంద్రబాబు నాయుడు గారిని నేను ఈవెంట్ మేనేజర్ అన్నందుకే ఓట్లు రాలేదట! కోగంటి సత్యం గారిని, గౌతమ్ రెడ్డి గారిని, బోండా ఉమ గారిని ప్రశ్నించినందుకే ఓట్లు రాలేదని వారి అభిమానులు కూడా అనుకుంటున్నారు!

ఒక్క విషయం స్పష్టంగా చెబుతున్నాను.

విజయవాడ మేయర్ పదవికి పోటీ చేసినప్పుడు నా బాధ్యత విజయవాడ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడటం, ప్రజా సమస్యలపై ప్రశ్నించడం. బుడమేరు సమస్యపై నిలదీయడం, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని గుర్తుచేయడం. ఇవన్నీ రాజకీయాల కోసం కాదు.. ప్రజల పక్షాన నిలబడటం కోసం!

అసైన్డ్ భూములను ఫ్రీహోల్డ్ చేశామని సెప్టెంబర్ 15న GO 588 విడుదల చేసి, పత్రికల్లో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. నెల రోజుల్లోనే ప్రక్రియ పూర్తిచేయాలని ఆ GOలో పేర్కొన్నారు. అప్పుడే నేను స్పష్టంగా చెప్పాను.. ప్రకటనలు చేసినంత మాత్రాన పనులు పూర్తికావు, వేచి చూడండి అని. నేను చెప్పినట్లుగానే నెలన్నర గడిచినా పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ 60 రోజుల్లో పూర్తి చేయాలని మరో GO విడుదల చేశారు. మీకు ప్రతిరోజూ పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో మీ పేరు కనిపించడం ముఖ్యం కావచ్చు. కానీ ప్రజలకు మాత్రం ఇచ్చిన హామీలు నెరవేరడం ముఖ్యం.

అందుకే అవహేళనలతో, స్పాన్సర్డ్ ప్రచారాలతో నన్ను వెనక్కి తగ్గించగలమని భావించే వారికి ఒక్కటే సమాధానం: మైదానంలోకి దిగిన తర్వాత విమర్శలకు భయపడి పారిపోయే వ్యక్తిని కాదు నేను. మీ విమర్శలు కొనసాగించండి.. నా పోరాటం కూడా కొనసాగుతుంది.

మీ వెనుక ఉన్నవారికి కూడా ఇదే విషయం చెప్పండి.

అలాగే, కష్టకాలంలో నాతో కలిసి నిలబడిన వ్యక్తులను ఎవరో ఏదో అన్నారని, అంటారని విసిరిపారేసే కరివేపాకు రాజకీయాలు చేసే వ్యక్తిని కూడా నేను కాదు. పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజాసమస్యల పరిష్కారానికై నా పోరాటం కొనసాగుతుంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save