పశ్చిమగోదావరి : జిల్లాలోని భీమవరానికి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాల కారణంగా భీమవరం వద్ద యనమదుర్రు డ్రైన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. యనమదుర్రు డ్రైన్ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో డ్రైనేజీలు నుంచి వరద నీరు వెనక్కి ఎగదన్నుతున్న పరిస్థితి. దీంతో పల్లపు ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది. యనమదుర్రు వరద ప్రవాహం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.యనమదుర్రు డ్రైన్ ఉధృతి పెరిగి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పల్లపు ప్రాంతాలలోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు పాలకొడేరు వద్ద గోస్తని నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పాలకోడేరు సబ్‌స్టేషన్‌లోకి వరద నీరు వచ్చి చేరింది.