Global Vaartha
Date of Publish : 06/11/2026, 2:17 pm
Editor : భవ్య జర్నలిస్ట్

భూపాలపల్లి జిల్లాలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి మండలం గోలాబుద్దారం (చిలకపల్లి) గ్రామ శివారులో యువకుడు అజ్మీరా చందు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసు విచారణలో మృతుడు చందును.. అతడి భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ కలిసి హత్యకు పాల్పడినట్లు తేలింది. భార్య పావని వివాహేతర సంబంధానికి భర్త అజ్మీరా చందు అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతడిని తొలగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన ప్రియుడు సంతోష్‌తో కలిసి భర్త చందును హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కుటుంబ బంధాలను పక్కనపెట్టి వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తనే హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

పోలీసుల అదుపులో నిందితులు..

అజ్మీరా చందు హత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా అనుమానితులపై దృష్టి సారించగా, మృతుడి భార్య పావని, ఆమె ప్రియుడు సంతోష్ పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పావని, సంతోష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ హత్య వెనుక ఉన్న పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలను పోలీసులు విచారిస్తున్నారు. కట్టుకున్న భర్తను కాదని వివాహేతర సంబంధం కోసం హత్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన ఈ ఘటన భూపాలపల్లి ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save