Global Vaartha
Date of Publish : 06/11/2026, 4:18 pm
Editor : భవ్య జర్నలిస్ట్

విద్యార్థుల జ్వరాలపై ఆందోళన చెందొద్దు.. మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి సత్యకుమార్‌

పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మన్యం జిల్లా శివన్నపేట గురుకులంలో విద్యార్థుల జ్వరాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్‌ (AP Minister Satyakumar) ఆరా తీశారు. ఈరోజు (శుక్రవారం) హెల్త్ డైరెక్టర్‌, జిల్లా అధికారులతో మాట్లాడిన మంత్రి.. గురుకులంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని వెల్లడించారు. గురుకులంలో మొత్తం 71 మందికి జ్వరాలు రాగా.. ఇప్పటికే 30 మంది విద్యార్థులు పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. 516 మంది విద్యార్థులకు ర్యాపిడ్‌ పరీక్షలు చేయగా.. కేవలం ఒకరికి మాత్రమే మలేరియా పాజిటివ్‌, మిగతా అందరికీ నెగెటివ్‌ వచ్చిందని చెప్పుకొచ్చారు.

ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశాం..

ప్రస్తుతం 38 మందిని ప్రత్యేకంగా వైద్యుల సంరక్షణలో ఉంచినట్లు మంత్రి వివరించారు. కురుపాం సీహెచ్‌సీలో మరో ముగ్గురు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం గురుకులంలో జనరల్‌ మెడిసిన్‌, పిల్లల వైద్య నిపుణులతో ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులకు సోకినవి తుఫాన్ అనంతర వైరల్‌ జ్వరాలేనని వైద్య నిపుణులు ప్రాథమిక అంచనా వేశారని తెలిపారు.

అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి..

44 మంది విద్యార్థులకు రక్తపరీక్షలు చేయగా ఫలితాలు సాధారణంగా వచ్చాయని.. ల్యాబ్‌కు విద్యార్థుల రక్త నమూనాలు చేరాయని వెల్లడించారు. పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు మూడు తాగునీటి వనరుల నమూనాలను పంపినట్లు మంత్రికి అధికారులు వివరించారు. జ్వర లక్షణాలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని.. అయినా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save