Global Vaartha
Date of Publish : 06/11/2026, 3:59 pm
Editor : భవ్య జర్నలిస్ట్

తరుణ్ తేజ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో షాక్.. దీపావళి బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఇంటర్నెట్ డెస్క్: తెహెల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 2013 నాటి అత్యాచార కేసులో ఆయనకు విధించిన పదేళ్ల జైలుశిక్షను నిలిపివేయడానికి, దీపావళి సందర్భంగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తన శిక్షను నిలిపివేయాలని కోరుతూ తేజ్‌పాల్ దాఖలు చేసిన పిటిషిన్‌ విచారణ సందర్భంగా.. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తనపై వచ్చిన అభియోగాన్ని, శిక్షను సవాల్ చేస్తున్న తేజ్‌పాల్‌కు ఉపశమనం కల్పించేందుకు తాము సుముఖంగా లేమని ధర్మాసనం పేర్కొంది.

కాగా.. బాంబే హైకోర్టు తీర్పుపై తేజ్‌పాల్ దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉండగా.. దీపావళి సందర్భంగా మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తేజ్‌పాల్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. దీపావళికి తేజ్‌పాల్‌ను ఇంటికి పంపేందుకు అనుమతించాలని అభ్యర్థించారు. అయితే.. ఈ వాదనల్ని గోవా ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యతిరేకించారు.

ఇదీ కేసు..

గోవాలో 2013 నవంబర్‌లో నిర్వహించిన థింక్‌ఫెస్ట్‌ కార్యక్రమం సందర్భంగా ఓ మహిళా సహోద్యోగిపై తరుణ్‌ తేజ్‌పాల్‌ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కేసు నమోదైంది. 2021లో తేజ్‌పాల్‌ను గోవా సెషన్స్‌ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే.. ఈ తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టులో సవాల్‌ చేసింది. విచారణ అనంతరం హైకోర్టు ఆయన్ను దోషిగా తేల్చి.. పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,21,000 జరిమానా విధిస్తూ 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ‌తేజ్‌పాల్. లొంగిపోవడం నుంచి తనకు తక్షణమే మినహాయింపు కల్పించాలని కోరారు. కానీ ఆయన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.
PDF Share Save