సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లాలో అంతర్రాష్ట్ర దారి దోపిడీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిన్న (గురువారం) అర్ధరాత్రి NH- 65పై వాహనాలు ఆపిన వారిని టార్గెట్ చేస్తూ ఈ ముఠా చోరీలకు పాల్పడిందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు. పూణేలో చోరీ చేసిన బైకుతో నిందితులు దొంగతనాలు చేస్తున్నారు. అక్టోబరు 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హైవేపై నాలుగు చోట్ల చోరీలను ఈ గ్యాంగ్ చేసింది.సంగారెడ్డి జిల్లా సదాశివపేట, కోహిర్, చిరాగ్పల్లిలో ఆగి ఉన్న వాహనాల్లోని వారిని డమ్మీ తుపాకీ, కత్తులతో బెదిరించి నగలు, డబ్బులను కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు. కర్ణాటకలోని హుమ్నాబాద్ వద్ద కూడా నిందితులు దారి దోపిడీ చేశారు. మడ్గి చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలో కేటుగాళ్లు పట్టుబడ్డారు. ముగ్గురిని అరెస్ట్ చేయగా, కీలక సూత్రధారి పరారీలో ఉన్నాడని ఎస్పీ పరితోశ్ పంకజ్ తెలిపారు.