అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల రీ పోలింగ్ ప్రక్రియ ఈరోజు కొనసాగుతోంది. ఏపీవ్యాప్తంగా మొత్తం 211 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు సగటున 41.74 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటలకు 12.56 శాతం, ఉదయం 11 గంటలకు 26.95 శాతంగా పోలింగ్ రికార్డైంది .
అత్యధికంగా కర్నూలు జిల్లా కోసిగి, అర్లబండలో 53.35 శాతం పోలింగ్ నమోదైంది. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు, గంగవరంలో 51.19 శాతం పోలింగ్ శాతం రికార్డు అయింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 49.9 శాతం, పల్నాడు జిల్లా క్రోసూరు, అండుకూరులో 39.37 శాతం, అనంతపురం జిల్లా కుడేరు, మరుట్లలో 39.29 శాతం, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడులో 32.23 శాతం పోలింగ్ నమోదు అయింది. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం, పొన్నంలో 26.82 శాతం పోలింగ్ రికార్డు అయింది.
చీరాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
మరోవైపు, బాపట్ల జిల్లాలోని చీరాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. 20 వార్డుల్లో ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. టీడీపీ - 13, వైసీపీ - 3, కాంగ్రెస్ - 4 వార్డులు వచ్చాయి. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి హనీ స్పందన 2,900 ఓట్ల మెజారిటీలో ఉన్నారు.
గన్నవరంలో కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణా జిల్లాలోని గన్నవరంలో కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. గన్నవరం సెయింట్ జాన్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలోని కౌంటింగ్ అధికారులకు స్వయంగా శిక్షణ సూచనలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చేశారు.