Date of Publish : 06/11/2026, 5:46 pm
Editor : భవ్య జర్నలిస్ట్
పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి
- వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను తానుగా వదలివెళ్లలేదని, ఆ పార్టీ నుంచి తనను బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను తానుగా వదలివెళ్లలేదని, ఆ పార్టీ నుంచి తనను బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తాడేపల్లిలో మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా పొమ్మనకుండా పొగబెట్టి, పదే పదే అవమానించడం వల్లే తాను బయటకు రావాల్సి వచ్చిందని తెలిపారు. సుమారు 70కు పైగా ఆయా ఘటనల్లో తనను అవమానించారని, ఇక భరించలేనటువంటి పరిస్థితుల్లోనే వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని పేర్కొన్నారు.
వైఎస్ ఏనాడూ అవమానించలేదు..
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కానీ, ఆయన తండ్రి రాజారెడ్డి కానీ తనను ఏనాడూ అవమానించలేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కేవలం జగన్ రెడ్డి పాలనలోనే, ఇతరులు చెప్పే మాటలు విని తనను అవమానించారని అన్నారు. జగన్ కూడా అప్పుడప్పుడు తనను అవమానించారని చెప్పారు. ఎవరూ ఇన్ని అవమానాలు భరించకూడదన్నారు. స్థానిక ఎన్నికల్లో గుంటూరు, ప్రకాశం, అనంతపురం సహా రాయలసీమ జిల్లాల్లో జరిగిన ఘటనలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని చెప్పుకొచ్చారు.
నా పార్టీలో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం..
అలాగే, నూతన పార్టీ ఏర్పాట్లపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 11వ తేదీన తమ పార్టీ ఆవిర్భావానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అన్నివర్గాలకు చెందిన నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా తాను పెట్టబోయే పార్టీలో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం ఉంటుందని, అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని మాటిచ్చారు. కొత్త పార్టీని పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీలో మరో ఇద్దరు నేతలు చేరారని ప్రకటించారు. విశ్వహిందూ పరిషత్ నాయకులు సుమతిరెడ్డి, దళిత సంఘాల నేత బోణి గణేశ్ తమ పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని రెండు కుటుంబాల చేతుల్లోనే పెట్టకూడదని అన్నారు. తమ పార్టీలో యువతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మాటిచ్చారు. నిరంకుశత్వ పాలన చేయకుండా తమ పార్టీ విధానం ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో చాలామంది తమ పార్టీలోకి రాబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎదగబోతుందని విజయసాయిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Global Vaartha.