పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు బోగీలు దగ్ధం

పంజాబ్: సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన నాలుగు కోచ్‌లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత్‌సర్ నుంచి న్యూ జల్పాయ్‌గురి వెళ్తున్న 12508 నంబర్ కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సరాయ్ బంజారా స్టేషన్ సమీపానికి రాగానే ఇంజిన్ నుంచి ఐదో బోగీలో తొలుత మంటలు కనిపించాయి. ఆ తర్వాత మరో మూడు బోగీలకు వ్యాపించాయి. దీంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి రైలును నిలిపివేయడంతో ప్రయాణికులంతా సురక్షితంగా దిగిపోయారు.ప్రయాణికులు పెను ముప్పు నుంచి తప్పించుకోవడంతో భారీగా ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైలు బోగీల్లో పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే, ప్రమాదానికి కచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :: 'అక్టోబర్ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!












