అమరవీరుల ఆశయ సాధనే నిజమైన నివాళి

- అమరవీరుల ఆశయ సాధన కోసం ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి
- పోట్ల రామనరసయ్య 50వ వర్ధంతి సభలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ఐఎఫ్‌టీయూ నేతల పిలుపు
గ్లోబల్ వార్త- ఏలూరు: కేంద్రంలోని బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా విప్లవోద్యమ అమరవీరుల స్ఫూర్తితో సమరశీల పోరాటాలు నిర్మించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు. వెంకటేశ్వరరావు (యు.వి.) పిలుపునిచ్చారు. అమరవీరుల ఆశయాలను సాధించేందుకు ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన విప్లవోద్యమ నాయకుడు పోట్ల రామనరసయ్య 50వ వర్ధంతి సభ శనివారం ఏలూరు మార్కెట్ యార్డ్ సమీపంలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు ఐఎఫ్‌టీయూ నగర ప్రధాన కార్యదర్శి ఎర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న యు.వి. ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1976 అక్టోబర్ 31న పోట్ల రామనరసయ్యను అరెస్టు చేసి, నవంబర్ 1న వరంగల్ జిల్లా చిలకలగుట్ట అడవుల్లో కాల్చి చంపారని పేర్కొన్నారు. ఆయనతో పాటు పీడీఎస్‌యూ నాయకుడు శ్రీపాద శ్రీహరి, పార్టీ కార్యకర్తలు జానకిరామయ్య, నారాయణ తదితరులను కూడా చిత్రహింసలకు గురిచేసి హతమార్చారని ఆరోపించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు విప్లవోద్యమాన్ని అణచివేయడానికి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించినప్పటికీ ఉద్యమం వెనుకడుగు వేయకుండా మరింత బలపడిందని అన్నారు. 1975 జూన్ 25న దేశంలో విధించిన ఎమర్జెన్సీ కాలంలో వందలాది మంది విప్లవకారులను హతమార్చారని ఆయన ఆరోపించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం రామచంద్రయ్య, పీడీఎస్‌యూ నాయకుడు జంపాల చంద్రశేఖర ప్రసాద్‌లను సైతం బూటకపు ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపారని విమర్శించారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా పీడిత ప్రజల విముక్తి, శ్రామిక రాజ్య స్థాపన లక్ష్యంగా విప్లవకారులు పోరాటాన్ని కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రస్తుతం కేంద్రంలోని మోడీ–అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను తమ ఆధీనంలోకి తీసుకుంటూ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా పాలన సాగిస్తోందని యు.వి. విమర్శించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను పాలకులు హరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని చంద్రబాబు–పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కూడా ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోందని విమర్శించారు. సమాజంలో దోపిడీ, పీడన, అణచివేత, పేదరికం కొనసాగినంతకాలం ప్రజా పోరాటాలను ఆపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుత పాలకుల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటితమై సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమసమాజ స్థాపన కోసం నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో ముందుకు సాగడమే అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. సభలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఏలూరు నగర కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్‌టీయూ నగర అధ్యక్షుడు బి. సోమయ్య, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు కె. నాని, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు ప్రసంగించారు. సభ ప్రారంభానికి ముందు అమరవీరుల స్మారకార్థం ఒక నిమిషం మౌనం పాటించారు. అమరవీరుల ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కోరాడ అప్పారావు, మీసాల రమణ, జనార్దన్, భాస్కర్, గురుమూర్తి, దుర్గారావు, ఆర్.ఎన్. నాయుడు, సూర్యనారాయణ, పాతాళ అప్పారావు, గడ్డం చంద్రశేఖర్, పిచ్చయ్య, బుడిమూరి శ్రీను, నాగరాజు, బండి నాగేశ్వరరావు, పద్మ, రాములమ్మ, డేవిడ్, సత్యనారాయణ, ఎస్.కె. బాషా, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్












