60 రోజులు నిద్రపోయి రూ.9.6 లక్షలు సొంతం చేసుకున్న మహిళ!

ఇంటర్నెట్ డెస్క్: ఉద్యోగం చేయాలంటే కష్టపడాలి.. చెమటోడ్చాలి.. అనుకుంటాం. కానీ అక్కడ మాత్రం 60 రోజులు హాయిగా నిద్రపోయినందుకు రూ.9.6 లక్షల బహుమతి సొంతమైంది! నిద్రను ఓ పోటీగా మార్చిన ఓ వినూత్న ఇంటర్న్‌షిప్‌లో ముంబైకి చెందిన జినియా ఛటర్జీ విజేతగా నిలిచి ఈ అరుదైన నజరానా దక్కించుకున్నారు.ప్రముఖ నిద్ర సంబంధిత ఉత్పత్తుల సంస్థ వేక్‌ఫిట్ నిర్వహించిన 'స్లీప్ ఇంటర్న్‌షిప్(Wakefit Sleep Internship)' ఐదో సీజన్‌లో ఈ కాంపిటీషన్ జరిగింది. ఈ పోటీకి దేశవ్యాప్తంగా సుమారుగా 2 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా.. అందులో నుంచి 10 మందిని ఎంపిక చేశారు. వీరికి 2 నెలలపాటు నిద్రకు సంబంధించి వివిధ సవాళ్లు విసిరారు. ఇందులో పోటీదారులు రోజువారీ నిద్ర సమయాన్ని, నిద్ర నాణ్యతను నమోదు చేసుకుంటూ తమ స్కోర్లను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి వారం ప్రత్యేకమైన సవాళ్లలోనూ పాల్గొనాలి. మామూలుగా నిద్రపోవడమే ఈ పోటీ అనుకుంటే పొరపాటే! ఇందులో సృజనాత్మకత, జ్ఞాపకశక్తి, పరిశీలనా సామర్థ్యాలనూ పరీక్షిస్తారు. ఇలా ఆయా విభాగాల్లో నమోదైన స్కోర్ల ఆధారంగా జినియా ఛటర్జీ విజేతగా నిలిచారు. ఆమెకు రూ.9.6 లక్షల నగదు బహుమతితో పాటు ఫ్రీ ట్రిప్ అవకాశం కూడా లభించింది.
2019లో ప్రారంభమైన ఈ వినూత్న కార్యక్రమానికి ఇప్పటివరకు నాలుగు సీజన్లలోనే 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 65 మంది ఇంటర్న్‌లకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున స్టైపెండ్ అందించారు. ఐదో సీజన్‌లో మాత్రం నిద్ర, సృజనాత్మకత, ప్రత్యేక సవాళ్లను మేళవించి విజేతకు ఈ భారీ బహుమతిని అందజేశారు.
ఇదీ చదవండి :: తోటాడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటుకు నోటు తిరస్కరణ












