రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి: ఎమ్మెల్యే హరీశ్ రావు

సిద్దిపేట : రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితుల కారణంగా సుమారు 25 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.ముఖ్యంగా వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకుండా వెంటనే మిల్లుల అలాట్‌మెంట్ పూర్తి చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పంటలు చేతికందక రైతులు నష్టపోయారని.. ఎండిపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని హరీశ్ రావుసూచించారు.పక్క రాష్ట్రాల్లో పంట నష్టాన్ని గుర్తించి రైతులకు పరిహారం అందిస్తూ అండగా నిలుస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతుల సమస్యలను పట్టించుకోకుండా మొద్దు నిద్రలో ఉందని తీవ్రస్థాయిలో విమర్శించారు. మార్కెటింగ్ శాఖలో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో అధికారులు, సిబ్బంది కొనుగోళ్ల ప్రక్రియలో పనిచేయడానికి ముందుకు రావడం లేదని ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని, మిల్లుల కేటాయింపులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించి వారిని ఆదుకోవాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్












