మాహీ అంకుల్ అని పిలుస్తా.. ధోనితో అనుబంధంపై బాలీవుడ్ నటి ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. క్రికెట్ అభిమానులు అతడిని ముద్దుగా 'కెప్టెన్ కూల్' అని పిలుచుకుంటారు. సహచర ఆటగాళ్లు, సన్నిహితులు మాత్రం 'మాహీ' అని సంబోధిస్తుంటారు. అయితే బాలీవుడ్ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అనుష్కా సేన్ మాత్రం ధోనిని 'మాహీ చాచూ' (మాహీ అంకుల్) అని పిలుస్తుందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధోనితో తనకున్న అనుబంధం గురించి ఈ 24 ఏళ్ల నటి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.7 కోట్లకు పైగా ఫాలోవర్లున్న అనుష్క.. ధోనితో కలిసి 21 ప్రకటనల్లో నటించడం విశేషం.‘నేను మహేంద్ర సింగ్ ధోనిని మాహీ చాచూ అని పిలుస్తాను. దాదాపు పదేళ్ల క్రితం తొలిసారి కలిశాను. ఆయనను కలవగానే మొదటగా.. మీది రాంచీ కదా? నేను కూడా అక్కడి నుంచే వచ్చాను అని చెప్పాను. దాంతో ఆయన చాలా సంతోషించారు. నిజంగానా? అంటూ ఆశ్చర్యపోయారు. మా ఇద్దరి మధ్య తొలి సంభాషణ అదే. ఆ తర్వాత మా బంధం మరింత బలపడింది. మేమిద్దరం కలిసి 21 యాడ్‌లలో కలిసి నటించాం. ఆయన సెట్‌లోకి రాగానే ‘చిక్కీ’ అని పిలిచేవారు. నేను కూడా ‘మాహీ చాచూ’ అని పలకరించేదాన్ని. మేమిద్దరం ఏడేళ్ల పాటు కలిసి పనిచేశాం’ అని అనుష్క వెల్లడించింది.
ఇదీ చదవండి :: మహిళా సంఘాలకు డ్రోన్లు












