'అక్టోబర్ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!

ప్రపంచంలో కార్మికవర్గ తొలి రాజ్యం ఏర్పరిచింది అక్టోబర్ విప్లవం (మన కాలెండర్ లో నవంబర్). బూర్జువా రాజ్యాంగాన్ని రద్దు చేసి, శ్రామికవర్గ నియంతృత్వ రాజ్యాంగాన్ని నెలకొల్పింది ఈ విప్లవం. దోపిడీకి, పీడనకు, ఆకలికి, అణచివేతకు, వివక్షకు, అన్యాయాలకు గురైన పీడిత వర్గానికి రాజ్యాధికారం చేపట్టేలా చేసింది ఈ అక్టోబర్ విప్లవం. సోషలిజం కల కాదు నిజమంటూ.. ఆ సమాజాన్ని అవనిపై అనుభవంలోకి చూపించింది ఈ విప్లవం.
ఈ విప్లవానికి ఇప్పుడు 103 ఏండ్లు.
ఆ విప్లవంలో ఎందరో మహిళలు క్రియాశీలంగా పాల్గొని విప్లవం విజయవంతం కావడానికి దోహదం చేశారు. అందుకే లెనిన్ రష్యా పునర్నిర్మాణాన్ని ‘ఆడమ్’ (పురుషుల)తో కాకుండా, ‘ఈవ్’ (స్త్రీల) తో ప్రారంభించారని నాటి సిడ్నీ అండ్ బీట్రీస్ వెబ్ అద్భుతంగా వర్ణించింది.
ఆ మహాత్తర విప్లవంలో ఎందరో మహిళలు స్ఫూర్తి దాయకమైన పాత్రను పోషించారు. వాళ్లలో ఒకరు 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'.
ఆ అక్టోబర్ విప్లవాన్ని స్మరించుకుంటూ...
రష్యన్ తొలితరం మహిళా విప్లవకారిణి, ఫెమినిస్ట్ 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా' గురించి నాలుగు మాటలు........
అలెగ్జాండ్రా వాసిలేవ్నా. బోల్షెవిక్ విప్లవకారిని. ఆమె పూర్తి పేరు అలెగ్జాండ్రా వాసిలేవ్నా ఆర్టియుఖినా.
శ్రామికవర్గపు మహిళ నాయకురాలు. వందేళ్ల క్రితం రష్యాలో జరిగిన అక్టోబర్ విప్లవంలోనూ, మహిళ విముక్తి ఉద్యమంలోనూ ఆమె కృషి అమూల్యమైనది. ఆమె నింపిన చైతన్యం ఇప్పటికి అక్కడి మట్టిలో పరిమళిస్తూ, స్వేచ్ఛ వాయువులతో మెదళ్ళని వికసింపజేస్తూనే ఉంది..
అలెగ్జాండ్రా ఒక శ్రామిక కుటుంబంలో, వైష్నీ వోలోచోక్ అనే నగరంలో 1889 నవంబర్ 6 జన్మించింది. 12 ఏళ్ళ వయసున్నప్పుడే ఆమె కుట్టే పనిని నేర్చుకుంది. ఒక రాజకీయ సమ్మెలో పాల్గొన్న కారణంగా వాళ్ళ అమ్మ ఉద్యోగం పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అలెగ్జాండ్రా తన కుటుంబాన్ని ఆదుకోడానికి తాత్కాలికంగా ఉద్యోగం చేయాల్సి వచ్చింది.
అయితే తాను విప్లవ మార్గానికి ఆకర్షితురాలై, దానిలో సుదీర్ఘ కాలం పనిచేయడానికి ప్రేరణ మాత్రం వాళ్ళ అమ్మనుండే పొందింది. 1903 లో జరిగిన సమ్మెలో పాల్గొన్న కారణంగా వాళ్ళ అమ్మను ఫ్యాక్టరీ నుండి తీసివేశారు. ఉద్యోగం పోవడంతో వస్త్ర పరిశ్రమలో పనిచేయడానికి సెయింట్ పీటర్స్ బర్గ్ కు మాకాం మార్చారు. అక్కడే అలెగ్జాండ్రా వాళ్ళ అమ్మతో పాటు వస్త్రాలు నేసే పనిలో చేరింది.
సరిగ్గా ఆ సమయంలోనే (1905) జరిగిన విప్లవాన్ని కళ్ళారా చూసిన అలెగ్జాండ్రా దానికి ఆకర్షితురాలై బోల్షివిక్ లకు మద్దతు రాలిగా మారిపోయింది.
మూడేళ్లు తిరక్కుండానే 1908 లో అలెగ్జాండ్రా 'సెయింట్ పీటర్స్ బర్గ్ టెక్ట్స్ టైల్ యూనియన్ లో చేరింది. అక్కడే బోల్షివిక్ నాయకుడు 'నికోలాయ్ ఇవనోవిచ్ లెబెదేవ్' (Nikolai Ivanovich Lebedev) నాయకత్వాన రాజకీయ పాటలు నేర్చుకొని మెల్లిగా ఎదుగుతూ వచ్చింది. అలెగ్జాండ్రా
చాలా తెలివైనది,చురకైనది కావడంతో చాలా తక్కువ కాలంలోనే కేంద్ర కార్మిక సంఘం సెక్రటేరియట్ కు ఎన్నికైంది.
అయితే తన రాజకీయ కార్యక్రమాల వల్ల 1909 లో దేశ బహిష్కరణ ను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. 1910లో అంటే తన 21 ఏట బోల్షివిక్ లో చేరిపోయింది.
అక్టోబర్ విప్లవ సమయంలో కూడ చాలా చురుకుగా పాల్గొన్న ఆమె, అందరి మద్దతుతో తొందర్లోనే సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటేరియేట్ స్థాయి వరకు ఎదిగింది. 1926 నుండి 1930 దాక దాదాపు నాలుగేళ్లు ఆ స్థానంలో ఉంది. సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ మహిళా విభాగమైన 'జెనోట్డెల్' (Zhenotdel)లో చివరిగా మిగిలింది కూడ తనే. 1931, మార్చ్ 1న ఇంటర్నేషనల్ జర్నలిస్ట్స్ ఆమెని సోవియట్ అత్యున్నత స్థానంలో కూర్చున్న మొదటి మహిళగా గుర్తించి చాటింది.
నవంబర్ 1918 న, రష్యన్ విప్లవం తర్వాత జరిగిన రష్యా మహిళా కార్మికులు, రైతుల మొదటి మహాసభలో పాల్గొంది. అది సివిల్ వార్ ఉదృతంగా నడుస్తున్న కాలమది. పార్టీ విభిన్నంగా వున్న మహిళలందరిని ఒక్కటిగా చేర్చి వారిని కౌంటర్ రెవల్యూషన్ కి తయారు చేయవలసిందిగా నిర్దేశించింది. అలెగ్జాండ్రా తన సేవలందించడానికి గాను ఉక్రెయిన్ ఫ్రంట్ వెళ్ళింది.
1918 లో జరిగిన మహిళల మహాసభల్లో, మహిళలు
బోల్షివిక్ లో ఉన్నంతా కాలం వారి శ్రమకి ప్రతిఫలం (commision
) ఇవ్వాలని ప్రకటన చేసింది. పనిచేస్తున్న మహిళా కార్మికులలో చైతన్యం తీసుకొచ్చి వారిని మానసికంగా బలంగా తయారు చేయడమే ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇది జెనోట్డెల్( zhenotdel) గా మారింది. జెనోట్డెల్లో అలెగ్జాండ్రా మహిళల విద్య, రాజకీయ అవగాహన, సమాజంలో వారి సమానత్వ హక్కు కోసం ముఖ్యమైన నాయకురాలుగా పనిచేసేది.
1925 నుండి 1930 దాకా మహిళా విభాగపు బాధ్యతలు నిర్వహించిన అలెగ్జాండ్రా, ఆ కాలం లోనే మహిళల కోసం ఎన్నో ఆర్టికల్స్ నీ రాసి వాటిని 'మహిళా కార్మికులు, 'కమ్యూనిస్టు మహిళ' అనే పేరుతో ప్రచురించింది.
1928 లో As part of the exercise of self criticism within the zhenotdel ని రాసింది. 11 సంవత్సరాలు మహిళా శ్రామికవర్గానికి అలసటలేని నాయకత్వనిచ్చింది. అలెగ్జాండ్రా ని బోల్షెవిక్ మహిళా ఉద్యమంలో క్రీయాశీలంగా పనిచేసిన వ్యక్తిగానే కాకుండా, సరిహద్దులో జరిగిన కమ్యూనిస్ట్ విప్లవాత్మక ఉద్యమంలో ఆమె పాత్రను కూడా గుర్తించాలి.
మహిళా విభాగం తర్వాత కూడా అలెగ్జాండ్రా జాతీయ సంఘాల్లో కూడా చురుగ్గా పనిచేసింది.
పార్టీ ఎడ్యుకేషన్ని ఇస్తూ మరో వైపు కార్మిక, రైతు సంఘాల్లో పనిచేసింది. 1934 నుండి 1938 వరకు పత్తి ఉత్పత్తి, కార్మిక సంఘాలలో ప్రముకురాలిగా పని చేసింది. రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతున్న సమయంలో ఆమె 'లిబరేటెడ్ లేబర్' టెక్స్ టైక్ మిల్ కి డైరెక్టర్ గా ఎన్నికైంది. 1951లో అంటే తన 62 ఏండ్ల వయసులో వున్నపుడు ఉద్యమాల క్రియాశీల బాధ్యతల నుండి తప్పుకొని మిగిలిన తన సమయనంత రాయడానికి కేటాయించింది. ఆమె చూసిన, ఎదుర్కొన్న పరిస్థితులన్నింటి గురించి రాసింది .
'సోషలిస్ట్ లేబర్ హీరో'గా కొనియాడబడే లెనిన్ ఆర్డర్ ను అలెగ్జాండ్రా మూడు సార్లు సొంతం చేసుకున్నదంటేనే అర్థం చేసుకోవచ్చు పనిపట్ల ఆమెకున్న నిబద్ధత.
యాభై ఏండ్లకు పైగా విప్లవ జీవితాన్ని నిబద్ధతతో, ఆచరణలో కొనసాగించిన అలెగ్జాండ్రా 80వ ఏట, 1969 ఏప్రిల్ 7న మాస్కో లో కన్నుమూసింది.
ఇవాళ భౌతికంగా అలెగ్జాండ్రా లేకపోవచ్చు కానీ ఆమె విప్లవ జీవితం ఎందరికో స్పూర్తి నింపుతూనే ఉంటుంది.
ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్












