పాఠశాల స్థాయి నుంచే ఏఐ పరిజ్ఞానం.. మిజోరం కొత్త ప్రయోగం

ఇంటర్నెట్ డెస్క్: అక్షరాస్యతలో ఇప్పటికే దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మిజోరం మరో ముందడుగేసింది. రాబోయే ఏఐ యుగాన్ని దృష్టిలో ఉంచుకుని.. అందుకు తగినట్టుగా విద్యార్థులను సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని లుంగ్లే జిల్లాలో 80 పాఠశాలలకు చెందిన 5,500 మందికి పైగా విద్యార్థులకు జనరేటివ్ ఏఐపై అవగాహన, శిక్షణ అందించనుంది. 'లుంగ్లే జెన్-ఏఐ మిషన్: ఏఐతో శక్తిమంతమైన లుంగ్లే జెన్-ఆల్ఫా' పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని సీఎం లాల్దుహోమా శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కృత్రిమ మేధ ఇప్పటికే నిత్యజీవితంలో భాగమైందని, విద్యార్థులు ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం సహా దాన్ని సమర్థంగా వినియోగించుకోవడం నేర్చుకోవాలని సూచించారు. డిజిటల్ రంగంలో మిజోరం కూడా ముందంజ వేయగలదని ధీమా వ్యక్తం చేశారాయన.
కాగా.. జిల్లా విద్యాశాఖ, కోడ్‌యోగి ఫౌండేషన్ సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం తొలిదశలో భాగంగా ఫౌండేషన్ 30 శిక్షణ మాడ్యూళ్లను రూపొందించింది. ఒక్కో మాడ్యూల్‌ను పూర్తి చేసేందుకు గరిష్ఠంగా గంట సమయం పట్టనుంది. వీటిలో ఏఐ పరిచయం, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ ప్లాట్‌ఫామ్స్, వాటి వినియోగం, వాస్తవ జీవితంలో వాటి అనువర్తనాలపై విద్యార్థులకు పూర్తి ఉచితంగా శిక్షణనివ్వనున్నారు. ఈ కార్యక్రమాన్నిభవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకూ విస్తరించాలని ఆకాంక్షించారు.
ఆ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ ఫైళ్లు, ఆన్‌లైన్ సేవలను ప్రోత్సహిస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యత ఎక్కువగా ఉండటం, ఆంగ్ల పరిజ్ఞానం కలిగిన వారి సంఖ్య గణనీయంగా ఉండటం వంటి అంశాలు ఏఐ రంగంలో ముందుకు వెళ్లేందుకు అనుకూలిస్తాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: స్నేహితుడి కూతురు తిరస్కరించిందని వివాహితుడి ఆత్మహత్య












