వరి నారుతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటం.. బర్త్‌డేకు వినూత్న గిఫ్ట్

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు రేపు. ఈ సందర్భంగా ఒకరోజు ముందే గజ్వేల్ నుంచి సీఎంకు సర్ప్రైజ్ బర్త్ డే గిఫ్ట్ వచ్చింది. కాంగ్రెస్ నేత మెట్టు సాయి వినూత్న రీతిలో సీఎంకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ నియోజకవర్గంలోని పొలంలో వరి నారుతో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని రూపొందించారు. ఇందుకోసం రైతులు దాదాపు 20 రోజుల పాటు శ్రమించారు. రైతు రుణమాఫీ, బోనస్, పేదలకు సన్నబియ్యం చేసినందుకు వరి పైరుతో సీఎం చిత్రపటాన్ని తయారు చేశారు.గతంలో రేవంత్ పుట్టినరోజు నాడు సైకత శిల్పం, వరిధాన్యం, తదితర రకాలుగా మెట్టుసాయి శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అదే విధంగా ఈ సంవత్సరం వరి నాట్లతో సీఎం చిత్రపటాన్ని తయారు చేయించారు. రేవంత్ రైతు బాంధవుడని మెట్టుసాయి పేర్కొన్నారు. ఈ చిత్రపటం నుంచి వచ్చే ధాన్యాన్ని రేవంత్‌కు బహూకరించనున్నట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి వందేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మెట్టుసాయి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా వినూత్న రీతిలో మెట్టు సాయి చెప్పిన బర్త్‌డే విషెస్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి :: 'అక్టోబర్ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!












