భర్త హత్యకు చాట్‌జీపీటీ సాయంతో ప్లాన్

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐపై అమెరికాలో మరో వ్యక్తి కోర్టుకెక్కారు. భార్య తన హత్యకు కుట్ర పన్నిందంటూ నార్త్ కెరొలీనాకు (యూఎస్ఏ) చెందిన జేమ్స్ గేట్స్ ఆరోపించారు. ఈ కుట్ర పన్నేందుకు తన భార్య షెరిల్ గేట్స్‌కు చాట్‌జీపీటీ సహకరించిందని ఆరోపిస్తూ చాట్‌బాట్ మాతృసంస్థ ఓపెన్ ఏఐపై కేసు వేశారు. హత్యకు కుట్ర పన్నేలా షెరిల్‌ను ప్రోత్సహించింది చాట్‌జీపీటీ అని మండిపడ్డారు.ఫిర్యాదులో జేమ్స్ పేర్కొన్న వివరాల ప్రకారం, జేమ్స్, షెరిల్ దంపతులకు 10 ఏళ్ల లోపు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటిపట్టునే ఉండి పిల్లల్ని చూసుకునే షెరిల్‌ను జేమ్స్ గతేడాది ఉద్యోగం చేయాలని కోరారు. అప్పటి నుంచీ తమ మధ్య వివాదాలు మొదలయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని అన్నారు. ఆ తరువాత తాను అనారోగ్యం పాలయ్యానని పేర్కొన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకు షెరిల్ కొన్ని వస్తువులను తీసుకెళ్లేందుకు మళ్లీ తిరిగి వచ్చిందన్నారు. ఆ సమయంలో ఆమె టేబుల్‌పై పెట్టిన ఓ చీటీ చూశాక తనకు కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్టు అనిపించిందని చెప్పారు.చీటీలో విషపూరిత పదార్థాల పేర్లు రాసున్నాయని చెప్పారు. డౌటొచ్చి ఆరా తీస్తే షెరిల్ చాట్‌జీపీటీతో చేసిన చాటింగ్, తనను హత్య చేసేందుకు పన్నిన కుట్ర బయటపడ్డాయని తెలిపారు. భర్త తననే హత్య చేసే అవకాశం ఉందని చాట్‌జీపీటీతో చాటింగ్ మొదలెట్టిన ఆమె ఆ తరువాత స్వీరక్షణ పేరిట చాట్‌బాట్ నుంచి పలు సమాచారాన్ని సేకరించి కుట్రకు తెరతీసిందని ఆరోపించారు. ఆమె భ్రమలన్నీ నిజమేనాలా చాట్‌జీపీటీ సమాధానం చెప్పిందని అన్నారు. చివరకు తాను అనారోగ్యం పడ్డానని చెప్పారు.
ఈ ఉదంతానికి సంబంధించి 2025లోనే స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఆమెకు వ్యతిరేకంగా పటిష్ఠమైన ఆధారాలు లేక కేసును కొట్టేశారు. అయితే, చాటింగ్‌ల స్క్రీన్ షాట్స్‌తో మరోసారి కోర్టును ఆశ్రయించిన జేమ్స్ చాట్‌జీపీటీపై న్యాయపోరాటం ప్రారంభించారు. భర్తతో వివాదాలు మొదలు హత్య వరకూ చాటింగ్ తీరుతెన్నులూ మారుతున్నా చాట్‌బాట్ ఈ విషయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని ఆరోపించారు. చాట్‌జీపీటీ డిజైన్‌లో లోపాలే ఈ పరిస్థితికి కారణమని మండిపడ్డారు. చాట్‌జీపీటీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.
ఇదీ చదవండి :: యూపీలో విషాదం.. ట్రాలీని ట్రక్కు ఢీకొని ఐదుగురు మహిళల మృతి












