అస్సాం చమురు నిల్వ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

ఇంటర్నెట్ డెస్క్: అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లా తెంగాఖాట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) చెందిన ఇంటర్మీడియట్ ట్యాంక్ ఫార్మ్ (ఐటీఎఫ్) లో (చమురు నిల్వ కేంద్రం) శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారని ఓఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం 9.05 గంటల ప్రాంతంలో నిర్వహణ పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని దిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ ఆస్పత్రి (ఏఎంసీహెచ్), ఆయిల్ ఇండియా ఆస్పత్రికి తరలించారు. ట్యాంక్ ఫార్మ్‌లో కార్మికులు వాల్వ్ పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ముడిచమురు నిల్వ విభాగంలో పేలుడు సంభవించడంతో భారీగా మంటలు వ్యాపించాయి.ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా ఆయిల్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్టు సంస్థ అయిన ముంబైకి చెందిన స్పెక్ట్రాన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరికొందరు కూడా గాయపడినట్లు తెలిస్తోంది. పేలుడుకు దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ఘటన జరిగిన వెంటనే ఆయిల్ ఇండియా అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని ఓఐఎల్ తెలిపింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది.
ఇదీ చదవండి :: 'అక్టోబర్ విప్లవం' యాదిలో 'అలెగ్జాండ్రా వాసిలేవ్నా'..!!












