తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు

బాపట్ల జిల్లా : తుఫాన్ బాధితులకు అండగా ఉంటామని, అధైర్యపడవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) భరోసా కల్పించారు. మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు సీఎం పర్యటిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని జిల్లెళమూడిలో నీట మునిగిన వరి పంటను ముఖ్యమంత్రి పరిశీలించారు. నీట మునిగి పంట నష్టపోయిన రైతులతో సీఎం మాట్లాడి ధైర్యం చెప్పారు. పంటలపై అన్నదాతలు ఎంతమేర పెట్టుబడులు పెట్టారని అడిగి తెలుసుకున్నారు.
కరవు పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం నీరు ఇచ్చి పంటలను ఆదుకుందని ముఖ్యమంత్రికి రైతులు తెలిపారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ దెబ్బ తీసిందంటూ ఆవేదనతో సీఎంకు పరిస్థితిని రైతన్నలు వివరించారు. పంటల బీమా చేయించుకున్నారా అని అన్నదాతలను ముఖ్యమంత్రి అడిగారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంట బీమాతో పాటు ప్రభుత్వం ఇచ్చే ఇన్‌ఫుట్ సబ్సిడీ రైతులను ఆదుకుంటుందని చెప్పారు. పంటల బీమా చేయించుకుంటే కలిగే ప్రయోజనాలపై పెద్దఎత్తున అవగాహన కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.
జిల్లెలమూడిలో వరద ప్రవాహాలను పరిశీలించిన సీఎం
అలాగే, జిల్లెలమూడి వంతెన వద్ద వరద ప్రవాహాలను సీఎం పరిశీలించారు. వాగు ఉధృతి కారణంగా చాలా ప్రాంతాలు నీట మునిగినట్లుగా అధికారులు, మంత్రి కొలుసు పార్థసారధి, స్థానిక ప్రజా ప్రతినిధులు తెలిపారు. గ్రామానికి వచ్చిన సీఎంను జిల్లెళమూడి అమ్మ భక్తులు కలిశారు. వారు అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
ఇదీ చదవండి :: కదిరి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు.












