కండువాలు మార్చేది నాయకులు.....

- బలయ్యేది కార్యకర్తలు..
- పెద్దలకు పదవులు కార్యకర్తలకు కన్నీళ్లు..
- ఇదేనా రాజకీయ నీతి...
- పార్టీ కోసం నాయకుల కోసం జీవితాలు ధారపోసిన కార్యకర్తల కుటుంబాల పరిస్థితి ఏమిటి?...
రాజకీయం వేరు వ్యక్తిగత స్నేహబంధం వేరు రాజకీయంగా పార్టీలు వేరైనా, వ్యక్తిగతంగా నాయకుల మధ్య స్నేహాలు కొనసాగడం తప్పు కాదు. కానీ ఆ స్నేహాల పేరుతో రాజకీయ నిర్ణయాలు తీసుకునే పెద్ద నాయకుల మధ్య నలిగిపోతున్న సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు మండపేట లో చర్చనీయాంశం!రాజకీయాల్లో నాయకులు తమకు అనుకూలంగా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అవసరమైతే పార్టీ మారతారు.కండువా మార్చుకుంటారు. కొత్త రాజకీయ సమీకరణాలు చేసుకుంటారు. నిన్నటి ప్రత్యర్థితోనే నేడు వేదిక పంచుకుంటారు.ఇదంతా వారి రాజకీయ వ్యూహంలో భాగమని చెబుతారు. కానీ అదే నాయకుడిని నమ్ముకుని ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసిన కార్యకర్తకు మాత్రం ఈ మార్పులు ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తాయి?..
నాయకులు పార్టీ మారితే రాజకీయ చతురత కార్యకర్త ప్రశ్నిస్తే తప్పా?
నాయకులకు రాజకీయ లాభాలు కార్యకర్తలకు నష్టాలేనా?...
ఒక నాయకుడిని నమ్మి కార్యకర్తలు తమ కుటుంబాలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎన్నికల సమయంలో ఎండనక, వాననక ప్రచారం చేస్తారు. తమ పనులను వదులుకుని నాయకుడి గెలుపు కోసం తిరుగుతారు.తమకు తెలిసిన వారిని ఓట్లు వేయమని కోరుతారు. రాజకీయంగా తమ మాటకు విలువ తగ్గినా, తమ నాయకుడి మాటకు విలువ రావాలని కష్టపడతారు.
కానీ ఎన్నికలు ముగిశాక, రాజకీయ సమీకరణాలు మారాక అదే కార్యకర్త పరిస్థితి ఏమిటి. నాయకుడు మరో పార్టీలోకి వెళ్లిపోతే అతని వెంట నడిచిన కార్యకర్త ఏం చేయాలి? కొత్త పార్టీ జెండా పట్టుకోవాలా? పాత పార్టీకి సమాధానం చెప్పాలా? లేక ఇన్నాళ్లూ తాను నమ్మిన రాజకీయ సిద్ధాంతాలను పక్కనపెట్టాలా?..
నాయకుడికి పార్టీ మారడం ఒక నిర్ణయం..
కార్యకర్తకు మాత్రం అది నమ్మకానికి ఎదురయ్యే పరీక్ష!...
కులం,నగదు,అవసరాలు, రాజకీయ సమీకరణాలు!...
రాజకీయాల్లో కుల సమీకరణాలు, ఆర్థిక ప్రయోజనాలు, పదవులు, వ్యక్తిగత అవసరాలు చర్చకు వస్తుంటాయి. కొందరు నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో విమర్శలూ వినిపిస్తుంటాయి. అయితే ఆ నిర్ణయాల వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలపై పడే ప్రభావాన్ని ఎవరు ఆలోచిస్తున్నారు?పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తకు తన నాయకుడిపై నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతోనే కుటుంబ సభ్యుల మాటలను సైతం పక్కనపెట్టి రాజకీయాల్లో కొనసాగుతాడు. నాయకుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీ మారినప్పుడు, కార్యకర్తకు మాత్రం తన ఇన్నేళ్ల శ్రమకు అర్థం ఏమిటన్న ప్రశ్న మిగులుతుంది...
పార్టీ మారిన నాయకుడికి కొత్త రాజకీయ వేదిక..
నమ్మిన నాయకుడు మారిపోయిన కార్యకర్తకు ఏ దారి?..
పెద్దలు కండువాలు మార్చితే తప్పేమిటి?..
పార్టీ మారడం ప్రతి నాయకుడి రాజకీయ నిర్ణయం కావచ్చు. వ్యక్తిగత స్నేహాలు కొనసాగించుకోవడం కూడా వారి హక్కే. అయితే ఒక ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పాలి. ఒక నాయకుడి కోసం సంవత్సరాల తరబడి పనిచేసిన కార్యకర్తల నమ్మకానికి విలువ లేదా?
నాయకుడు పార్టీ మారగానే కొత్త రాజకీయ అవకాశాలు, పదవులు, సన్మానాలు దక్కే పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొందరికి ఆర్థికంగా కూడా ప్రయోజనాలు కలగవచ్చు. అదే సమయంలో వారి కోసం పనిచేసిన సాధారణ కార్యకర్తలు తమ జీవనోపాధి, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సి వస్తుంది...
ఇక్కడ ప్రతి పార్టీ మారిన నాయకుడూ...
లాభపడుతున్నాడని చెప్పలేం. ప్రతి కార్యకర్త నష్టపోతున్నాడని కూడా అనలేం. కానీ నాయకుల రాజకీయ మార్పుల మధ్య కార్యకర్తల శ్రమ, నమ్మకం, కుటుంబాల భవిష్యత్తు నిర్లక్ష్యానికి గురవుతున్నాయా? అన్న ప్రశ్న మాత్రం సమాజం ముందుంది.
జెండా మోసిన కార్యకర్త కుటుంబానికి భరోసా ఎవరు?
ఒక సామాన్య కార్యకర్త రాజకీయాల్లో కొనసాగడానికి వెనుక ఒక కుటుంబం ఉంటుంది. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, ఉద్యోగం లేదా వ్యాపారం, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ రాజకీయాలపై నమ్మకంతో సమయం, డబ్బు, శ్రమ వెచ్చిస్తారు.కొందరు కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. రాజకీయంగా తమ నాయకుడు ఎదగాలని కోరుకుంటారు. కానీ నాయకుడు తన దారి మార్చుకున్నప్పుడు, కార్యకర్తకు అండగా నిలిచేది ఎవరు? అతని కుటుంబం ఎదుర్కొనే ఇబ్బందులను పట్టించుకునేది ఎవరు?...
నాయకుడి రాజకీయ ఎదుగుదలలో కార్యకర్తకు భాగస్వామ్యం ఉంటే ఆ కార్యకర్త కష్టాల్లో ఉన్నప్పుడు నాయకుడి బాధ్యత ఎక్కడికి పోతుంది?...
జెండా మోసిన కార్యకర్త చివరకు జీవనోపాధి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి రావడం ఏ రాజకీయ వ్యవస్థకైనా ఆలోచించాల్సిన అంశం. కార్యకర్తను ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుచేసుకుని, ఆ తర్వాత అతని కుటుంబ పరిస్థితులను పట్టించుకోకపోతే రాజకీయ సేవకు అర్థం ఏముంటుంది?...
ఓటరు పరిస్థితి కూడా అంతేనా?...
కార్యకర్తలే కాదు.. ఓటర్లు కూడా రాజకీయ నాయకులపై ఆశలు పెట్టుకుంటారు. తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, తమకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని ప్రజలు నమ్మి ఓటు వేస్తారు.అయితే ఎన్నికల ముందు ఒక మాట.. ఎన్నికల తర్వాత మరో మాట వినిపిస్తే ప్రజల నమ్మకం ఏమవుతుంది? పార్టీలు మారినా ప్రజలకు ఇచ్చిన హామీలపై బాధ్యత కొనసాగుతుందా? రాజకీయ సమీకరణాలు మారినంత మాత్రాన ప్రజల సమస్యలు మారిపోతాయా?
పార్టీలు, నాయకులు మారవచ్చు. కానీ ప్రజల అవసరాలు మాత్రం అలాగే ఉంటాయి. తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్య, వైద్యం వంటి సమస్యలకు రాజకీయ కండువాలతో సంబంధం లేదు. ప్రజలకు కావాల్సింది హామీల కంటే పరిష్కారాలు....
నాయకుల రాజకీయాలకు లెక్కలుంటే....
కార్యకర్తల త్యాగాలకు విలువ లేదా?...
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. పార్టీలు మారడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ రాజకీయాల్లో ఏ మార్పు జరిగినా, తమను నమ్మిన కార్యకర్తల పట్ల నాయకులకు కనీస బాధ్యత ఉండాలి. కార్యకర్తలను కేవలం ప్రచారానికి, జనసమీకరణకు, ఎన్నికల విజయానికి ఉపయోగపడే సాధనాలుగా చూడకూడదు.
కండువా మార్చుకున్న నాయకుడికి కొత్త పదవి రావచ్చు.. కానీ ఆ నాయకుడి కోసం తన సమయాన్ని, శ్రమను, అవకాశాలను వెచ్చించిన కార్యకర్త కోల్పోయిన సంవత్సరాలకు విలువ ఎవరు కడతారు?
పార్టీ మారిన నాయకుడిని ప్రశ్నించడం శత్రుత్వం కాదు. కార్యకర్తల కష్టాలకు గుర్తింపు కోరడం తప్పు కాదు. రాజకీయ నాయకులు తమ నిర్ణయాలను సమర్థించుకునే హక్కు కలిగి ఉన్నట్లే, ఆ నిర్ణయాల ప్రభావంపై ప్రశ్నించే హక్కు కార్యకర్తలకు, ఓటర్లకు కూడా ఉంది.
నాయకులారా.మీకు కండువా మార్చుకునే స్వేచ్ఛ ఉంది. కానీ మీ కోసం జెండా మోసిన కార్యకర్తల నమ్మకాన్ని గౌరవించే బాధ్యత కూడా ఉంది.పదవులు పొందిన నాయకుల విజయగాథలే కాదు. వారి వెనుక పనిచేసిన కార్యకర్తల జీవితాలు కూడా రాజకీయ చర్చలో భాగం కావాలి. నాయకుడి ఎదుగుదలలో కార్యకర్త పాత్రను గుర్తించి, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడే రాజకీయ సేవకు నిజమైన గౌరవం లభిస్తుంది.
కండువాలు మార్చుకున్న నాయకుల రాజకీయ భవిష్యత్తు గురించి అందరూ ఆలోచిస్తున్నప్పుడు. జెండాలు మోసిన కార్యకర్తల కుటుంబాల భవిష్యత్తు గురించి ఆలోచించేది ఎవరు?......
ఈ పరిణామల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటా అని అయోమయ స్థితిలో ఉన్నారు.......
ఇదీ చదవండి :: చెలరేగుతున్న భారత పేసర్లు.. సీక్రెట్ చెప్పేసిన బౌలింగ్ కోచ్ మోర్కెల్












