హైదరాబాద్‌లో పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. 16 మంది అరెస్ట్

హైదరాబాద్ : నగరంలోని బేగంబజార్‌లో భారీ పేకాట శిబిరంపై గోషామహల్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ధనలక్ష్మి ఫిష్ గోదాంలో గుట్టుచప్పుడు కాకుండా పేకాట దందా సాగుతోంది. అందర్, బాహర్, తీన్‌పత్తి పేరుతో రెండు గదుల్లో జూదం నిర్వహిస్తున్నట్లు బయటపడింది. పక్కా సమాచారంతో అర్ధరాత్రి సమయంలో గోషామహల్ పోలీసులు దాడి నిర్వహించారు. జూదం ఆడుతున్న 16 మంది నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు వచ్చిన వెంటనే మరో 12 మంది నిందితులు పరారయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.మొత్తం 28 మందిని నిందితులుగా గుర్తించారు. వీరంతా హైదరాబాద్‌లోని బేగంబజార్, జిన్సీ చౌరస్తా పరిసర ప్రాంతాలకు చెందినవారిగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు కూడా జూద ముఠాలో ఉన్నట్లు వెల్లడైంది. పేకాట స్థావరం నుంచి రూ.23,800 నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మూడు సెట్ల పేకాట ముక్కలను జప్తు చేశారు. నలుగురు నిందితుల నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 4తో పాటు BNS 112(2) కింద కేసు నమోదు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. అక్రమ జూద కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇదీ చదవండి :: ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు












