10/11/2026, Tuesday · 12:49:24 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

పదవీ విరమణ చేసిన వ్యక్తిని మళ్లీ ఉద్యోగంలోనే చంపేశారు!

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 4:06 PM నల్గొండ 1

పదవీ విరమణ చేసిన వ్యక్తిని మళ్లీ ఉద్యోగంలోనే చంపేశారు!
Want this news as a newspaper clip?Print News Clip
  • నకిలీ మరణ ధ్రువీకరణతో కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం..
  • నల్లగొండలో అధికారుల అక్రమాల సినిమా కథ!
  • అసలు విలన్..?
  • డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కమ్ సీసీ పోలె రంజిత్ కుమార్‌ కిరోల్ పాత్ర..

  నల్లగొండ; ఒక ప్రభుత్వ ఉద్యోగం.. దాని వెనుక రూ.13 లక్షల ఒప్పందం..!

ఆధార్ కార్డులో చిరునామా మార్పు.. మున్సిపాలిటీలో నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం..

 వైద్య ఆరోగ్య శాఖలో తప్పుడు విచారణ నివేదికలు..

చివరకు కుమారుడికి కారుణ్య నియామకం!

సినిమా కథను తలపించేలా సాగిన ఈ వ్యవహారం నల్లగొండ జిల్లాలో కలకలం రేపుతోంది. పదవీ విరమణ పొందిన వ్యక్తిని విధుల్లో ఉండగానే మరణించినట్లు రికార్డులు సృష్టించి, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించిన అక్రమ వ్యవహారాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు.

ఈ కుంభకోణంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు.

మొదటి అంకం.. పదవీ విరమణ చేసిన వ్యక్తి మరణించినట్లు కథ!

నకిరేకల్ మండలం ఒగోడు గ్రామానికి చెందిన చామకూరి వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లా శాలిగౌరారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేశారు...ఆయన 2025 మే 31న పదవీ విరమణ పొందారు.

కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు 2025 నవంబర్ 17న సాయంత్రం 5.10 గంటలకు మరణించారు. నవంబర్ 26న ఆయన స్వగ్రామమైన ఒగోడులో దశదిన కర్మలు నిర్వహించారు.

అక్కడే ఈ కథకు మరో మలుపు మొదలైంది.

వెంకటేశ్వర్లు ఉద్యోగంలో ఉండగానే మరణించినట్లు రికార్డులు సృష్టిస్తే ఆయన కుమారుడికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందని కొందరు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

రెండో అంకం.. రూ.13 లక్షల ఒప్పందం!

ఈ వ్యవహారంలో మృతుడి భార్య చామకూరి వసంత, కుమారుడు చామకూరి రాజు, బంధువులైన చామకూరి రాజశేఖర్, చామకూరి రవీందర్, రాచకొండ వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ గౌడ్, శాలిగౌరారం పీహెచ్‌సీ సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధ రెడ్డి కలిసి పథకం రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో నల్లగొండ డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ కమ్ సీసీ పోలె రంజిత్ కుమార్‌ను సంప్రదించినట్లు విచారణలో తేలింది.

మృతుడి భార్య వసంతతో రూ.13 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.

మూడో అంకం.. ఆధార్ చిరునామా మార్చి నకిలీ ధ్రువీకరణ!

ఈ కుట్రలో కీలకమైన అడుగు ఆధార్ చిరునామా మార్పు.

చామకూరి రాజశేఖర్, రవీందర్ సమన్వయంతో నల్లగొండలోని మీ సేవా కేంద్ర నిర్వాహకుడు పనస చంద్రశేఖర్ అలియాస్ చందు ద్వారా వెంకటేశ్వర్లు ఆధార్ కార్డులో చిరునామా మార్చినట్లు పోలీసులు గుర్తించారు...

నల్లగొండ పట్టణంలోని డీవీకే రోడ్డులో చైతన్యపురి కాలనీ, వార్డు నంబర్ 10, ఇంటి నంబర్ 500/1లో నివసిస్తున్నట్లు తప్పుడు చిరునామా నమోదు చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ చిరునామా ఆధారంగా వెంకటేశ్వర్లు 2025 మే 28న విధుల్లో ఉండగానే మరణించినట్లు నల్లగొండ మున్సిపాలిటీ నుంచి నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం పొందినట్లు పోలీసులు తెలిపారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం.. వెంకటేశ్వర్లు వాస్తవంగా మరణించిన తేదీ 2025 నవంబర్ 17 కాగా, నకిలీ పత్రంలో మాత్రం మే 28నే మరణించినట్లు చూపించారు. అప్పటికి ఆయన పదవీ విరమణ కూడా పొందారు.

నాలుగో అంకం.. మున్సిపల్ శాఖలో ఎవరి పాత్ర ఎంత?

నకిలీ మరణ ధ్రువీకరణ పత్రం పొందే ప్రక్రియలో మున్సిపల్ శాఖకు చెందిన వార్డు ఆఫీసర్ ముక్కముయిల శివ జనార్ధన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎన్. ప్రదీప్ రెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మీ సేవా నిర్వాహకుడు పనస చంద్రశేఖర్ అలియాస్ చందు, చామకూరి రాజశేఖర్ తదితరులు పరస్పరం సహకరించుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

మృతుడి మేనల్లుడు, అన్నెపర్తి 12వ బెటాలియన్ టీజీఎస్పీలో పనిచేస్తున్న కట్ల సతీష్‌కు విషయం తెలియజేసి దరఖాస్తుపై సాక్షిగా సంతకం చేయించినట్లు పోలీసులు తెలిపారు.

అలాగే పూర్తి వివరాలు తెలియకుండా నక్రేకంటి సైదులు గౌడ్, నక్రేకంటి అశోక్‌లతో కూడా సంతకాలు చేయించినట్లు విచారణలో వెల్లడైంది.

ఐదో అంకం.. డీఎంహెచ్‌వో కార్యాలయంలో అసలు వ్యవహారం!

ఈ కుంభకోణంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర వెలుగులోకి రావడం మరింత సంచలనం సృష్టించింది.

శాలిగౌరారం పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆకుల కృష్ణ సూర్య శిల్ప తన సంతకంతో సంబంధిత దరఖాస్తు ఫైలును డీఎంహెచ్‌వో కార్యాలయానికి పంపించినట్లు పోలీసుల ప్రకటనలో పేర్కొన్నారు.

ఆ తర్వాత డీఎంహెచ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న పోలె రంజిత్ కుమార్, గింకల రాకేష్ యాదవ్, తుంగతుర్తి మోహన్ కృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మహబూబ్ అలీ, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగిరెడ్డి జితేందర్ రెడ్డి, శాలిగౌరారం పీహెచ్‌సీ సీనియర్ అసిస్టెంట్ కంచర్ల జగన్నాధ రెడ్డి తదితరులు తప్పుడు విచారణ నివేదికలు రూపొందించి సమర్పించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ఈ పత్రాల ఆధారంగానే మృతుడి కుమారుడు చామకూరి రాజుకు దామరచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్లు పోలీసులు తెలిపారు.

ఆఖరి అంకం.. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో గుట్టురట్టు!

ఈ వ్యవహారంపై నల్లగొండ మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2026 నవంబర్ 4న నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్ 299/2026 కింద కేసు నమోదు చేశారు.

తొలుత వన్‌టౌన్ ఎస్‌ఐ జి. ముత్తయ్య దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ కె. శివరామిరెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

వన్‌టౌన్ ఇన్‌చార్జి సీఐ కె. ఆది రెడ్డి, రూరల్ ఎస్‌ఐ బి. శివప్రసాద్, టూటౌన్ ఎస్‌ఐ డి. సైదాబాబు, వన్‌టౌన్ ఎస్‌ఐలు ఎన్. వెంకట్ నారాయణ, జె. సైదులు, ఇతర పోలీసు సిబ్బంది సమన్వయంతో దర్యాప్తు చేపట్టి ఈ వ్యవహారాన్ని ఛేదించారు.

పోలీసుల స్వాధీనంలో కీలక ఆధారాలు

రూ.5 లక్షల నగదు,ఒక కంప్యూటర్,ఒక ప్రింటర్,12 సెల్‌ఫోన్లు,మృతుడు చామకూరి వెంకటేశ్వర్లు ఫొటో...

అరెస్టయిన వారి వివరాలు

1. చామకూరి వసంత – మృతుడి భార్య.

2. చామకూరి రాజు – మృతుడి కుమారుడు, కారుణ్య నియామకం పొందిన ఉద్యోగి.

3. కంచర్ల జగన్నాధ రెడ్డి – సీనియర్ అసిస్టెంట్, పీహెచ్‌సీ శాలిగౌరారం.

4. రాచకొండ వెంకటేశ్వర్లు అలియాస్ వెంకట్ గౌడ్ – ఒగోడు గ్రామం.

5. డాక్టర్ ఆకుల కృష్ణ సూర్య శిల్ప – మెడికల్ ఆఫీసర్.

6. పనస చంద్రశేఖర్ అలియాస్ చందు – మీ సేవా కేంద్ర నిర్వాహకుడు.

7. కట్ల సతీష్ – కంప్యూటర్ ఆపరేటర్, 12వ బెటాలియన్ టీజీఎస్పీ.

8. ముక్కముయిల శివ జనార్ధన్ – వార్డు ఆఫీసర్.

9. ఎన్. ప్రదీప్ రెడ్డి – శానిటరీ ఇన్‌స్పెక్టర్.

10. పోలె రంజిత్ కుమార్ – జూనియర్ అసిస్టెంట్ కమ్ సీసీ టు డీఎంహెచ్‌వో.

11. నాగిరెడ్డి జితేందర్ రెడ్డి – ఆఫీస్ సూపరింటెండెంట్.

12. మహబూబ్ అలీ – అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్.

13. గింకల రాకేష్ యాదవ్ – సీనియర్ అసిస్టెంట్.

14. తుంగతుర్తి మోహన్ కృష్ణ – జూనియర్ అసిస్టెంట్.

పరారీలో ఉన్న ఇద్దరు

చామకూరి రాజశేఖర్ – జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

చామకూరి రవీందర్ – హెల్త్ అసిస్టెంట్, పీహెచ్‌సీ కేతేపల్లి.

వీరిద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పుడు మిగిలిన ప్రశ్నలు!

ఒక వ్యక్తి పదవీ విరమణ పొందిన తర్వాత మరణించినా, ఉద్యోగంలో ఉండగానే మరణించినట్లు రికార్డులు ఎలా సృష్టించారు?

ఆధార్ చిరునామా మార్పు ఎలా జరిగింది?

మున్సిపల్ మరణ ధ్రువీకరణ పత్రం జారీ ప్రక్రియలో ఎక్కడెక్కడ నిబంధనలు ఉల్లంఘించారు?

డీఎంహెచ్‌వో కార్యాలయంలో తప్పుడు విచారణ నివేదికలు ఎలా ఆమోదం పొందాయి?

రూ.13 లక్షల ఒప్పందంలో డబ్బులు ఎవరెవరికి చేరాయి?

ఈ అక్రమ నియామకం వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా?

ఈ ప్రశ్నలకు పోలీసుల తదుపరి దర్యాప్తులో సమాధానాలు రావాల్సి ఉంది.

ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఇన్ని శాఖలు.. ఇంతమంది వ్యక్తులు.. ఇన్ని తప్పుడు పత్రాలు! నల్లగొండలో వెలుగులోకి వచ్చిన ఈ కారుణ్య నియామకాల కుంభకోణం ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డుల విశ్వసనీయతపైనే ప్రశ్నలు లేవనెత్తుతోంది.

పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

man killedRetiredjob

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News