మున్సిపల్ చైర్మన్లలో 94 శాతం స్ట్రైక్ రేట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు

అమరావతి : స్థానిక ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం వరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ... గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్‌ను నమ్ముతానని.. తన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారని తెలిపారు. 2024 కంటే మెరుగైన ఫలితాలు వచ్చాయన్నారు. 2024లో తమకు 55.3 శాతం ఓట్లు వస్తే.. వైసీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.9 శాతం ఓట్లు వస్తే.. వైసీపీకి 33.56 శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించారు. వైసీపీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయన్నారు. మున్సిపల్ చైర్మన్లలో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించామన్నారు.ఎంపీటీసీ స్థానాల్లో 90 శాతంపైనే కూటమి కైవసం చేసుకుందని.. 659 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 575 స్థానాల్లో విజయం సాధించిందని ముఖ్యమంత్రి తెలిపారు. అల్లూరి జిల్లా మినహా అన్ని జడ్పీలు గెలిచామని వివరించారు. 7 జిల్లాల్లో ఒక్క జడ్పీటీసీ కూడా వైసీపీ గెలవలేదన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో కూటమికి 67 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ఈవీఎమ్‌లను ట్యాంపర్ చేశారని వైసీపీ ఆరోపించిందని.. ఇప్పుడు బ్యాలెట్లను రిగ్గింగ్ చేశారంటున్నారని విమర్శించారు. మరి పోస్టల్ ఓట్ల సంగతి ఏంటి అని ప్రశ్నించారు.
కూటమి పాలనకు ప్రజలు పట్టం కట్టారని.. అన్ని ప్రాంతాల్లోనూ కూటమిని ప్రజలు ఆదరించారని చంద్రబాబు తెలిపారు. ఈ ఫలితాలు సంక్షేమం, అభివృద్ధి పాలనకు దక్కిన గౌరవమన్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు కూటమిగా ఏర్పడ్డామని వెల్లడించారు.స్వర్ణాంధ్ర విజన్‌తో పరిపాలన మొదలుపెట్టామని.. స్పష్టమైన విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. కరవును జయించడమే ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. రాళ్ల సీమగా ఉన్న రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం అన్నారు. ఖరీఫ్‌లో 53 శాతం లోటు వర్షపాతం ఉందని.. ముందుచూపుతో ఆలోచించడం వల్లే గతేడాది నీటిని పొదుపుగా వాడుకున్నామన్నారు. పోలవరాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని, గోదావరి-కావేరి అనుసంధానం జరిగితే కరవు ఉండదని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఇదీ చదవండి :: ప్రైవేట్ ఉద్యోగులకూ పెటర్నిటీ లీవ్స్.. కేంద్రానికి జాతీయ మహిళా కమిషన్ సిఫార్సులు












