గోవా మంద్రెమ్ బీచ్‌లో ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: సముద్రంలో స్వేచ్ఛగా విహరించాల్సిన ఓ భారీ తిమింగలం అనుకోకుండా ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దీనిని గమనించిన స్థానిక రెస్క్యూ సిబ్బంది అప్రమత్తమైంది. అతి కష్టం మీద దానిని సురక్షితంగా కాపాడి తిరిగి సముద్రంలోకి పంపించారు. సముద్ర జీవి ప్రాణాలను కాపాడేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నం ఫలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, పర్యాటకులు, స్థానికులు మాత్రం తిమింగలాన్ని చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ ఘటన గోవాలోని మంద్రెమ్ బీచ్‌లో ఆదివారం చోటుచేసుకుంది.ఆదివారం మధ్యాహ్నం మంద్రెమ్ బీచ్‌లో ఓ తిమింగలం ఒడ్డుకు చేరింది. స్థానికుల సమాచారంతో దృష్టి లైఫ్‌సేవర్ గ్రూప్‌కు చెందిన సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తిమింగలం ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి, దానిని తిరిగి సముద్రంలోకి పంపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, తిమింగలం భారీ పరిమాణంలో ఉండటంతో తొలుత దానిని కదిలించడం సాధ్యం కాలేదు. దీంతో రెస్క్యూ సిబ్బంది పెద్దపెద్ద వస్త్రాలను దాని శరీరానికి చుట్టారు. అనంతరం సముద్రం వైపు లాగుతూ ముందుకు కదిలించారు. ఈ క్రమంలో తిమింగలం శరీరంపై నీటిని చల్లుతూ పలు జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు దానిని లోతైన సముద్ర జలాల్లోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. తిరిగి సముద్రంలోకి చేరిన తిమింగలం ఈదుకుంటూ వెళ్లిపోయింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సముద్ర జీవి ప్రాణాలను కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది చేసిన కృషిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కొన్ని నెలల క్రితం ముంబైలోని బాంద్రా తీరంలో సుమారు 26 అడుగుల పొడవున్న ఓ యువ హంప్‌బ్యాక్ తిమింగలం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. దానిని కాపాడేందుకు అధికారులు, రెస్క్యూ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ చివరకు అది ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో మంద్రెమ్ బీచ్‌లో తిమింగలాన్ని సురక్షితంగా సముద్రంలోకి పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి :: నేడు ధన త్రయోదశి












